పెనుకొండ/శ్రీసత్యసాయి: 'గురు బ్రహ్మ, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః' అంటూ గురువులను దైవంగా కొలుచుకునే సమాజం మనదని, అటువంటి దైవాలపై గొడ్డలి పార్టీ గూండాలు దాడి చేయడం దారుణమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు.
ఒకవైపు లిక్కర్ స్కామ్, మరో వైపు గ్రూప్ 1 పోస్టుల మూల్యాంకనంలో అక్రమాలు బయటకు రావడంతో జగన్ బ్యాచ్లో గగ్గోలు మొదలైందని, టీచర్ల ఆత్మగౌరవం దెబ్బతినేలా, వారి కష్టాన్ని తక్కువ చేసి చూపేలా మెగా డీఎస్సీలో అక్రమాలు అంటూ విష ప్రచారం మొదలుపెట్టారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ టీచర్లపైనా, సామాన్యులపైనా దాడులు చేస్తే ఊరుకోబోమని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ను, వైసీపీ నాయకులను మంత్రి సవిత హెచ్చరించారు. జగన్కు దమ్ము, ధైర్యం ఉంటే మెగా డీఎస్సీ, గ్రూప్ 1 పోస్టుల మూల్యాంకనంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైసీపీ కార్యకర్తలను జగన్ రెడ్డి పావులుగా వాడుకుంటున్నారని, ఆయన మాటలు నమ్మి దాడులకు తెగబడితే నష్టపోయేది వైసీపీ కార్యకర్తలేనని అన్నారు.
పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ, విజయవాడలోని శాప్ కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డికి తమ కష్టాలు చెప్పుకోడానికి వచ్చిన టీచర్లపై గొడ్డలి పార్టీ గూండాలు దాడులు చేయడం బాధాకరమన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః అంటూ గురువులను దైవంగా కొలిచే సమాజం మనదని, అటువంటి దైవాలపై జగన్ గ్యాంగ్ దాడులు చేయడం క్షమించరాని నేరమన్నారు. 2025 మెగా డీఎస్సీలో టీచర్ అభ్యర్థులు రేయింబవళ్లు కష్టపడి లక్ష్యం సాధించారని, అటువారి కష్టాన్ని తక్కువ చేసి చూపుతూ, ఆత్మగౌరవం కించపరిచేలా నీలి మీడియాలో విషపు రాతలు రాస్తూ గొడ్డలి పార్టీ నాయకులు రాక్షసానందం పొందుతున్నారని మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
డైవర్షన్ కే దాడులు
గ్రూప్ 1 పోస్టుల మూల్యాంకనం ఎల్.కె.జి. విద్యార్థుల మాదిరిగా మూడు పర్యాయాలు దిద్దారని సిట్ నివేదికలో బయటపడిందని మంత్రి సవిత తెలిపారు. లిక్కర్ కుంభకోణంలో జగన్ సహా వైసీపీ పెద్ద తలకాయలు అరెస్టయ్యే అవకాశముందనే వార్తలు మీడియాలో వెల్లువెత్తుతున్నాయన్నారు. ఈ వార్తల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి విజయవాడలోని శాప్ కార్యాలయంపైనా, ఉపాధ్యాయులపైనా గొడ్డలి పార్టీ గూండాలు దాడులకు తెగబడ్డారన్నారు. సమాజాన్ని ఉన్నతమార్గంలో పయనించేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయులపై జగన్ పార్టీ నాయకులు, గూండాలు దాడులు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా దాడులకు తెగబడితే చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మంత్రి సవిత హెచ్చరించారు.
