అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, మార్పు కోసం పోరాడాలనుకునే యువత తమ పోరాటాన్ని విధ్వంసం కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మలచుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ, సమస్యలపై పోరాడటం తప్పు కాదని, ఆ పోరాటాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని అన్నారు.
వ్యవస్థలో లోపాలుంటే వాటిని ధ్వంసం చేయడం కాదు, సరిదిద్దాలని, మార్పు కోసం చేసే పోరాటం ప్రజలకు నష్టం కలిగించకుండా, భవిష్యత్తుకు బాటలు వేసేలా ఉండాలని సూచించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ ఆలోచన, మానవత్వం, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని గుర్తుచేశారు.
భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయులు చిన్న వయసులోనే దేశం కోసం నిస్వార్థంగా పోరాడారని, అదే స్ఫూర్తిని నేడు దేశ నిర్మాణానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి మరింత వేగం అందుతుందని, పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల ద్వారా 47 లక్షల రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.3,125 కోట్లు అందిస్తున్నామని వివరించారు.
