సీనియర్ జర్నలిస్టు, సాహస యాత్రికుడు నాగనబోయిన నాగేశ్వరరావు (ఎన్.ఎన్.ఆర్) స్వీయ సాహస రచన 'కలల రహదారి' హిందీ అనువాద పుస్తకాన్ని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు ఆవిష్కరించారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో 'స్వప్నం కే మార్గ్ పర్ భారత్ యాత్ర మే మేరా అనుభవ్' పుస్తక ఆవిష్కరణ అనంతరం గవర్నర్ హరిబాబు ఈ సాహస యాత్ర పుస్తకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
- 2004 సెప్టెంబర్ 19న మోటారు సైకిళ్లపై ప్రారంభమైన భారత యాత్ర — 45 రోజుల్లో 10,063 కి.మీ.
- 17 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా, మూడు సముద్రాలు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగిన సాహస యాత్ర
- 2019లో వెలువడిన స్వీయ అనుభవాల పుస్తకం ఇప్పుడు 'ప్రేమ్ పబ్లికేషన్' ద్వారా హిందీ అనువాదంలో విడుదల
- పుస్తకావిష్కరణలో విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు
జర్నలిస్టు నాగేశ్వరరావు తన మిత్రుడు భరద్వాజ దయాళ్తో కలిసి 2004 సెప్టెంబర్ 19న మోటారు సైకిళ్లపై భారత యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర 17 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 45 రోజుల పాటు 10,063 కిలోమీటర్ల దూరం సాగింది. విశాఖపట్నం నుంచి మొదలైన మోటార్ సైకిల్ సాహస యాత్ర మూడు సముద్రాలు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి, దేశంలోని నాలుగు ప్రధాన నగరాల మీదుగా సాగి, నవంబర్ 2వ తేదీన విశాఖపట్నం చేరుకోవడంతో 45 రోజుల యాత్ర ముగిసింది.
తన స్వీయ అనుభవాలతో 2019లో పుస్తకాన్ని వెలువరించారు. ఆ పుస్తకాన్ని ప్రముఖ కార్మిక నాయకులు డాక్టర్ కేఎస్ మోహన్ కుమార్, మాధవి సుహాసిని దంపతులు ప్రచురించారు. ప్రముఖ అనువాదకురాలు పారనంది నిర్మల హిందీలోకి అనువదించగా, కే.ఎల్. ప్రసన్న గౌరీ హిందీ టైపింగ్, డిజైన్ చేశారు. ప్రేమ్ పబ్లికేషన్ తరఫున చాంద్ మాల్ అగర్వాల్ హిందీ అనువాద పుస్తకం 'స్వప్నం కే మార్గ్ పర్ భారత్ యాత్ర మే మేరా అనుభవ్'ను ప్రచురించారు.
విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు పి. విష్ణుకుమార్ రాజు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. జర్నలిస్టు ఎన్.ఎన్.ఆర్ ఇప్పటి వరకు ఏడు పుస్తకాలను రాశారు.
