స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం — ఢిల్లీ ఏపీ భవన్‌లో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారధి, అనగాని సత్యప్రసాద్

న్యూఢిల్లీ, అక్టోబర్ 6 (ఎక్స్‌ప్రెస్ టుడే): స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ న్యూఢిల్లీలోని ఏపీ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్‌లో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా వారు ఉద్ఘాటించారు.

సుప్రీంకోర్టు ద్వారా న్యాయం సాధించేందుకు ప్రభుత్వం పోరాటం చేస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని అధిగమించేందుకు తగిన ఎంపైరికల్ డేటాతో సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులను పూర్తిగా అధ్యయనం చేసి, వాటి ఆధారంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామన్నారు.

బీసీ రిజర్వేషన్లు సక్రమంగా అమలులోకి వస్తే సుమారు 16,800 పోస్టులు బీసీలకు దక్కుతాయని ఆయన తెలిపారు. పంచాయతీ సర్పంచ్‌ల నుంచి మొదలుకుని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మేయర్‌లుగా ఎదిగి, భవిష్యత్తులో అసెంబ్లీ, పార్లమెంట్ వంటి చట్టసభలకు వెళ్లే గొప్ప అవకాశాలు వీరికి లభిస్తాయని పేర్కొన్నారు.

బలహీన వర్గాల రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, తదుపరి న్యాయ పోరాట వ్యూహాలపై చర్చించేందుకు ముగ్గురు మంత్రుల బృందం ఢిల్లీకి వచ్చిందని తెలిపారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లతో సమావేశమైన మంత్రుల బృందం, న్యాయ నిపుణుల సలహాలు, సుప్రీంకోర్టు తీర్పులు, వివిధ కమిషన్‌ల రిపోర్టుల ఆధారంగా భవిష్యత్తు విధివిధానాలపై ప్రముఖ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, దేవదత్ కామత్‌లతో చర్చించినట్లు వెల్లడించారు.

గత ప్రభుత్వం ఎలాంటి చట్ట సవరణ చేయకుండా, కనీసం సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా బలహీన వర్గాల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందని మంత్రి విమర్శించారు. బలహీన వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం, ఏ పరిస్థితుల్లోనైనా 34 శాతం రిజర్వేషన్లు దక్కేలా చివరి నిమిషం వరకు న్యాయపోరాటం చేస్తామని, ఇందుకోసం సుప్రీంకోర్టులో తగిన కేసులు వేసి నిపుణుల సలహాలతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ, బలహీన వర్గాలకు కేవలం ఏదో రిజర్వేషన్ ఇవ్వాలనే కాకుండా, రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో 34 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించారని గుర్తుచేశారు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలు, 243డి, 243టి సెక్షన్ల ప్రకారం బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు.

రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారని అన్నారు. ప్రపంచం మెచ్చిన నాయకుడైన ఆయన ఎన్నో రాజకీయ ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తారని పేర్కొన్నారు.