న్యూఢిల్లీ, నవంబర్ 4 (ఎక్స్‌ప్రెస్ టుడే): అగ్నిపథ్ పథకం కింద అగ్నివీరులకు మరో రెండేళ్ల అదనపు సేవా కాలాన్ని కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ప్రకటించారు.

అగ్నిపథ్ కింద నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక సాయుధ దళాల నుంచి బయటకు వెళ్లాల్సిన 75 శాతం మంది అగ్నివీరులు ఇకపై మరో రెండేళ్లు సేవలందించవచ్చు. ఆ తర్వాత రెగ్యులర్ దళాల్లో చేరేందుకు వారికి అవకాశం ఉంటుంది. నాలుగు లేదా ఆరేళ్ల సేవ తర్వాత, నిర్దేశిత ఎంపిక ప్రమాణాలకు అనుగుణంగా ఇష్టపడే అగ్నివీరులందరూ రెగ్యులర్ సైనికులుగా చేరే మార్గం ఏర్పడుతుందని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

కేబినెట్ నిర్ణయం వివరాలను చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి మీడియాకు వివరించారు. 2022 జూన్ 14న పథకం ప్రారంభమైనప్పటి నుంచి అగ్నివీరుల పనితీరును అంచనా వేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని, మొదటి బ్యాచ్ నాలుగేళ్ల సర్వీసు పూర్తికి చేరువవుతోందని, పనితీరు మదింపులో అభిప్రాయం ప్రోత్సాహకరంగా ఉందని ఆయన చెప్పారు. నాలుగేళ్ల అగ్నిపథ్ విధానం యథాతథంగా కొనసాగుతుందని, పథకాన్ని నిలిపివేయలేదని స్పష్టం చేశారు.