న్యూఢిల్లీ, అక్టోబర్ 27 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ (ఈఎస్టీఐసీ) 2026ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ఇతర దేశాల్లో కనిపెట్టిన సాంకేతికతలను అందిపుచ్చుకునే దశ నుంచి ప్రపంచం కోసం కొత్త సాంకేతికతలను సృష్టించే దశకు భారత్ చేరిందని ఆయన అన్నారు.
ఈ సదస్సు అక్టోబర్ 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, అధునాతన పదార్థాలు, తయారీ, ఆరోగ్యం, ఇంధనం, వాతావరణ, సముద్ర శాస్త్రాలు సహా 12 అంశాలపై చర్చలు జరుగుతాయి. సీఎస్ఐఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం మార్గదర్శకత్వంలో నిర్వహిస్తోంది. సుమారు 150 డీప్‌టెక్ స్టార్టప్ స్టాళ్లతో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు.
భవిష్యత్తును తీర్చిదిద్దే రంగాలు
సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీలు, బయోటెక్నాలజీ, అధునాతన పదార్థాలు, రోబోటిక్స్, అంతరిక్షం, స్వచ్ఛ ఇంధనం, తదుపరి తరం కమ్యూనికేషన్లు భవిష్యత్తును తీర్చిదిద్దే రంగాలని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం జాతీయ మిషన్ల ద్వారా శాస్త్రీయ పునాది నిర్మిస్తున్నామని చెప్పారు. గత ఏడాది ఈ సదస్సు నుంచి ప్రకటించిన రూ.1 లక్ష కోట్ల పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ (ఆర్డీఐ) నిధి ఫలితాలు ఇస్తోందని తెలిపారు.
ఈ సదస్సు కేవలం ఆలోచనల మార్పిడికే పరిమితం కాకుండా స్పష్టమైన ఫలితాలను అందించే వేదికగా మారాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రారంభోత్సవానికి ముందు స్టార్టప్ వ్యవస్థాపకులతో మాట్లాడానని, యువ భారతీయులు ఆలోచిస్తున్న స్థాయి తనను ఆకట్టుకుందని అన్నారు. ‘క్రియేటివ్ మైండ్స్, క్యాటలైజింగ్ సైన్స్, ఎంపవరింగ్ టెక్నాలజీస్’ అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరుగుతోంది.