న్యూఢిల్లీ, అక్టోబర్ 28 (ఎక్స్‌ప్రెస్ టుడే): జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్‌పీపీఏ) 543 క్యాన్సర్ మందుల బ్రాండ్లకు సవరించిన గరిష్ఠ చిల్లర ధరల (ఎంఆర్‌పీ) జాబితాను బుధవారం విడుదల చేసింది. కొన్ని మందుల ధరలు 90 శాతానికి పైగా తగ్గాయి. కొత్త ధరలు నవంబర్ 9 నుంచి అమల్లోకి వస్తాయి.

షెడ్యూల్డ్ కాని 137 క్యాన్సర్ మందులపై వర్తక మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేస్తూ అక్టోబర్ 17న గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. తయారీదారులు అక్టోబర్ 27 వరకు సమర్పించిన వివరాల ఆధారంగా ఈ జాబితా రూపొందింది. మిగిలిన కంపెనీలు సవరించిన ధరలు సమర్పించే కొద్దీ జాబితాను తాజాపరుస్తామని ఎన్‌పీపీఏ తెలిపింది.

ఆసుపత్రులు, దుకాణాలకు ఆదేశాలు

నవంబర్ 9 నుంచి రిటైలర్లు, ఆసుపత్రులు సవరించిన ధరలకే మందులు విక్రయించాలి, ధరల జాబితాను ప్రదర్శించాలి. రోగులు ప్రభుత్వ ‘ఫార్మా సహీ దామ్’ యాప్ ద్వారా కొత్త ధరలను సరిచూసుకోవచ్చు.