న్యూఢిల్లీ, అక్టోబర్ 19 (ఎక్స్‌ప్రెస్ టుడే): కేంద్ర హోం శాఖ (ఎంహెచ్ఏ) సోమవారం కీలక సలహా జారీ చేసింది. ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రులు వంటి ప్రముఖుల మార్ఫింగ్ లేదా డీప్‌ఫేక్ వీడియోలను ఉపయోగించి, నకిలీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వస్తున్న మోసపూరిత ప్రకటనల పట్ల ప్రజలను అప్రమత్తం చేసింది.
బాధితులను ఫోన్ కాల్స్ లేదా వాట్సాప్ చాట్ల ద్వారా సంప్రదిస్తున్నారని, లేదా స్క్రాచ్ కార్డ్, స్పిన్ అండ్ విన్ పోటీలు నిర్వహించే వెబ్సైట్లకు మళ్లిస్తున్నారని ఆ శాఖ తెలిపింది. పలు సందర్భాల్లో +92 (పాకిస్థాన్) వంటి అంతర్జాతీయ నంబర్ల నుంచి కాల్ చేసి, మిమ్మల్ని యాదృచ్ఛికంగా ఎంపిక చేశామని, ఆర్థిక సాయం అందుతుందని నమ్మిస్తున్నారని పేర్కొంది. ఆ తర్వాత పన్నులు, ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్, ధ్రువీకరణ రుసుముల పేరుతో పదేపదే డబ్బులు వసూలు చేస్తున్నారని వివరించింది.
ప్రభుత్వ శాఖల ప్రతినిధులమని చెప్పేవారి గుర్తింపును అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని, అనుమానం ఉంటే సంబంధిత కార్యాలయాన్ని స్వయంగా సందర్శించాలని సూచించింది. మోసపోయిన వారు లేదా ఇలాంటి యాప్‌లు, లింకులు కనిపించినవారు వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరింది.