న్యూయార్క్‌లో జరుగుతున్న 81వ ఐరాస సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 'సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్' (ఎస్‌ఆర్‌ఐఏ)పై భారత్ ప్రయోజనాలు, ఆందోళనలను ఆయన పునరుద్ఘాటించారు.

  • ఐరాస సర్వసభ్య సమావేశం వేదికగా జైశంకర్-రూబియో భేటీ
  • ఎస్‌ఆర్‌ఐఏపై భారత్ ప్రయోజనాలు, ఆందోళనలు పునరుద్ఘాటన
  • గల్ఫ్, ఉక్రెయిన్ పరిస్థితులపైనా ఇద్దరి మధ్య చర్చ
  • వాణిజ్యం, ఇంధనం, ఔషధాలు, కీలక ఖనిజాలపై సమన్వయమని రూబియో వ్యాఖ్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత వారం సంతకం చేసిన 'లిండ్సే ఓ. గ్రాహమ్ సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026' రష్యా ఇంధనం కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి కల్పిస్తుంది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జరిగిన తొలి కీలక భేటీ ఇదే. "ఎస్‌ఆర్‌ఐఏకు సంబంధించి భారత్ ప్రయోజనాలు, ఆందోళనలను పునరుద్ఘాటించాను" అని భేటీ అనంతరం జైశంకర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

భారత్ తన ఇంధన కొనుగోళ్లు 140 కోట్ల మంది ప్రజల భద్రత కోసం, వైవిధ్యభరిత సరఫరాల ఆధారంగా తీసుకుంటున్న నిర్ణయాలేనని గతంలోనే అమెరికాకు స్పష్టం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై ఈ చట్టం ప్రభావం చూపే అవకాశంపై ఉన్నత స్థాయిలో ఇప్పటికే వాషింగ్టన్‌కు తమ ఆందోళనలను భారత్ తెలియజేసింది.

భేటీ అనంతరం రూబియో ఎక్స్‌లో స్పందిస్తూ, వాణిజ్యం, ఇంధనం, ఔషధాలు, కీలక ఖనిజాలు సహా ద్వైపాక్షిక సంబంధాల్లోని కీలక అంశాలపై చర్చించినట్టు, ఇరు దేశాల శ్రేయస్సు కోసం సమన్వయంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. గల్ఫ్, ఉక్రెయిన్ పరిస్థితులపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు జైశంకర్ వెల్లడించారు.