న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: దేశంలో సిమెంట్ ధరలు పెంచేందుకు కంపెనీలు మరోసారి సన్నద్ధమవుతున్నాయి. అక్టోబర్‌లో బస్తాపై రూ.5 నుంచి రూ.20 వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ బ్రోకింగ్ నివేదిక తెలిపింది.

సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా బస్తాకు సగటున రూ.7 చొప్పున సిమెంట్ ధరలు పెరిగాయని, మరోసారి ధరల సవరణ చేపట్టొచ్చని పేర్కొంది. సిమెంట్ ఉత్పత్తి, రవాణాలో చమురు ధరలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇటీవలి కాలంలో చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కంపెనీలు ధరలు పెంచే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో స్తబ్దుగా ఉన్న సిమెంట్ ధరలు.. సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా సగటున బస్తాకు రూ.7 చొప్పున పెరిగి రూ.356కి చేరినట్లు పేర్కొంది. దక్షిణాదిలో అత్యధికంగా బస్తాకు రూ.11 చొప్పున పెరగ్గా.. కొన్ని చోట్ల రూ.9, మరికొన్ని చోట్ల రూ.5 చొప్పున పెరిగినట్లు తెలిపింది. కంపెనీల బిల్లింగ్ రేట్లు పెరిగినప్పటికీ, డీలర్లు అమ్మకాల లక్ష్యాల కోసం పాత ధరలకే విక్రయించడం వల్ల వినియోగదారులపై ఆ భారం ఇంకా పూర్తిగా పడలేదని నివేదిక పేర్కొంది.