న్యూఢిల్లీ వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రెండో రోజు ముగింపు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక ఖనిజాల సరఫరాను దౌత్యపరమైన ఆయుధంగా వాడొద్దని సభ్య దేశాలకు పిలుపునిచ్చిన మోదీ, అభివృద్ధి చెందుతున్న దేశాలకు న్యాయబద్ధమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన వనరుల లభ్యత అవసరమని స్పష్టం చేశారు.

  • న్యూఢిల్లీలో ముగిసిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు
  • కీలక ఖనిజాల సరఫరాను ఆయుధంగా వాడొద్దని సభ్య దేశాలకు ప్రధాని మోదీ పిలుపు
  • న్యాయబద్ధమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన వనరుల లభ్యత కోసం డిమాండ్
  • సదస్సు ముగియగానే ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రపంచ నేతలు, ప్రతినిధులు

సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలకు కీలకమైన అరుదైన ఖనిజాల ఎగుమతులపై కొన్ని దేశాలు ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు సాంకేతిక పరివర్తనలో వెనుకబడకుండా చూసేందుకు బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో అంతర్జాతీయ పాలన, వాణిజ్యం, రక్షణ సహకారంపై నేతలు లోతుగా చర్చించారు. సదస్సు ముగింపు సందర్భంగా బ్రెజిల్, రష్యా, చైనా సహా పలు దేశాల ప్రతినిధులు ఢిల్లీ నుంచి తమ తమ దేశాలకు బయలుదేరారు.