ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్‌లలో నాలుగు రోజుల పర్యటనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం బయలుదేరారు. తాష్కెంట్‌లో ద్వైపాక్షిక రాజ్య పర్యటన అనంతరం, బిష్కెక్‌లో జరిగే 26వ షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు సాగే ఈ పర్యటన మధ్య ఆసియాతో భారత్ వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసేదిగా భావిస్తున్నారు.
తాష్కెంట్‌లో మీర్జియోయెవ్‌తో ద్వైపాక్షిక చర్చలు
ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్‌కత్ మీర్జియోయెవ్ ఆహ్వానం మేరకు ఆగస్టు 29, 30 తేదీల్లో తాష్కెంట్‌లో రాజ్య పర్యటన చేపట్టిన ప్రధాని మోదీకి ఇది నాలుగోసారి ఉజ్బెకిస్తాన్ పర్యటన. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడంతో పాటు 'వికసిత్ భారత్', 'యాంగి ఉజ్బెకిస్తాన్' దార్శనికతలను ముందుకు తీసుకెళ్లే దిశగా అధ్యక్షుడు మీర్జియోయెవ్‌తో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని శాస్త్రి స్మారక చిహ్నం, మహాత్మా గాంధీ కేంద్రాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు.
2011లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఎదిగిన భారత్-ఉజ్బెకిస్తాన్ సంబంధాలు అప్పటి నుంచి అనేక రంగాల్లో గణనీయంగా విస్తరించాయని, ప్రస్తుతం ఉభయ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు దాదాపు 100 కోట్ల డాలర్లకు చేరాయని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.
బిష్కెక్‌లో ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు, పుతిన్‌తో భేటీ అవకాశం
తాష్కెంట్ పర్యటన అనంతరం కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదిర్ జపారోవ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బిష్కెక్‌కు వెళ్లనున్నారు. ఆగస్టు 31న స్వాగత విందు అనంతరం సెప్టెంబర్ 1న 26వ ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు ప్రధాన సమావేశం జరుగనుంది, ఇందులో ప్రధాని ప్రసంగించనున్నారు. సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సహా పలువురు ఎస్‌సీవో సభ్య దేశాల అధినేతలతో ప్రధాని ద్వైపాక్షిక భేటీలు జరిపే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.
భద్రత, అనుసంధానత, ఆర్థిక అవకాశాలపై భారత్ తన ప్రాధాన్యాలను ఈ సదస్సులో స్పష్టం చేయనుందని, ఎస్‌సీవో వేదికగా మధ్య ఆసియా, రష్యాతో భారత్ నిమగ్నత మరింత పెరుగుతుందని విదేశాంగ శాఖ పేర్కొంది.
