ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నామని, ప్రతి కుటుంబానికి అండగా ఉన్నామనే భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కేవలం రెండేళ్లలో 90 శాతం అమలు చేశామని, మాటల్లో కాకుండా గణాంకాల్లో కూడా చూపిస్తున్నామని పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రారంభమైన తెలుగుదేశం లీడర్షిప్ కాంక్లేవ్‌లో మంత్రి సవిత ప్రసంగించారు.
రైతు, మహిళ, విద్యార్థి, బీసీ, మత్స్యకారుడు, చేనేత కార్మికుడు, దివ్యాంగుడు — ప్రతి వర్గానికీ అండగా నిలుస్తున్నామని, 24 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇందులో భాగంగా రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు తీసుకొచ్చామని తెలిపారు. తల్లికి వందనం పథకంలో భాగంగా ఏటా 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.15 వేల చొప్పున అందిస్తున్నామని, ఇందుకోసం రెండేళ్లలో రూ.20,090 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.
90 శాతం హామీలు అమలు చేశాం
అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతు కుటుంబానికీ ఏటా రూ.20 వేలు అందిస్తున్నామని, రెండేళ్లలో 46 లక్షల మంది రైతులకు రూ.14,664 కోట్లు పెట్టుబడి సాయంగా అందించామని మంత్రి సవిత తెలిపారు. 31.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.1,100 కోట్లు రైతులకు చెల్లించామన్నారు. మహిళల ఉచిత ప్రయాణం ద్వారా ఇప్పటివరకు 87 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని, ఇందుకోసం రూ.3,218 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. దీపం-2 పథకంలో 4.57 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించామని, గ్యాస్ సబ్సిడీ కోసం రూ.3,800 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందని పేర్కొన్నారు.
బీసీల రాజకీయ సాధికారతే లక్ష్యం
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని మంత్రి సవిత తెలిపారు. స్థానిక సంస్థల్లోనూ 34 శాతం రిజర్వేషన్ల కోసం ముందుకు సాగుతున్నామన్నారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించిందని, దాని వల్ల 16,800 రాజకీయ పదవులను బీసీలు కోల్పోయారని ఆరోపించారు.
బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 138 బీసీ కులాల ఆత్మగౌరవానికి, రక్షణకు బీసీ ప్రొటెక్షన్ యాక్ట్-2026 తీసుకురావడానికి చర్యలు చేపట్టామని మంత్రి సవిత తెలిపారు. 50 ఏళ్లు పైబడిన 1,30,796 మంది మత్స్యకారులకు రూ.505 కోట్ల మేర పింఛన్లు అందించామని, వేట నిషేధ భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచామని తెలిపారు. 50 ఏళ్లు పైబడిన 85,940 మంది చేనేత కార్మికులకు రూ.844 కోట్ల పింఛన్లు అందించామని, 62,541 నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. దివ్యాంగుల పింఛన్లను రూ.6 వేలకు పెంచామని, 1,750 మందికి మూడు చక్రాల వాహనాల కోసం రూ.18.47 కోట్లు ఖర్చు చేశామని మంత్రి సవిత వివరించారు.
