నూతన నేతన్న భరోసా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న చేనేత కార్మికులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే చేనేతలు ఇకపై బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ అందజేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మాస్టర్ వీవర్ నుంచి వేతనాలు తీసుకున్న వివరాలు సమర్పిస్తే సరిపోతుందని ఆమె తెలిపారు.

ఈ నెల 7వ తేదీ నుంచి వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగుల పింఛన్లతో పాటు చేనేత పింఛన్లతో సహా అన్ని రకాల పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ నిబంధన నేతన్న భరోసా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న చేనేతలకు తీవ్ర ప్రతిబంధకంగా మారింది. మాస్టర్ వీవర్ల వద్ద పనిచేసే చేనేతలకు వేతనాలు వ్యక్తిగతంగా చెల్లిస్తుండటంతో, బ్యాంకు స్టేట్‌మెంట్ ఇవ్వాలన్న నిబంధన వారిని తీవ్ర ఆవేదనకు గురిచేసింది.

ఈ సమస్యను పలువురు నేతన్నలు, చేనేత సంఘాల ప్రతినిధులు మంత్రి సవిత దృష్టికి తీసుకురాగా, ఆమె వెంటనే స్పందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి చేనేతల సమస్యను తీసుకెళ్లారు. బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ నిబంధనను సడలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో, అర్హులైన చేనేతలందరికీ నేతన్న భరోసా పింఛన్లు అందజేసేందుకు మార్గం సుగమమైందని మంత్రి సవిత తెలిపారు.

నూతనంగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే నేతన్నలు ఇకపై బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని, 50 ఏళ్లు నిండిన చేనేతలందరికీ నేతన్న భరోసా పింఛన్లు అందజేస్తామని, అర్హులైనవారు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్లు లేకపోయినా దరఖాస్తులు స్వీకరించాలని ఆయా జిల్లాల చేనేత, జౌళి శాఖాధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు.

కూటమి ప్రభుత్వ ఈ నిర్ణయంతో వేలాది మంది నేతన్నలకు ఉపశమనం లభించనుందని మంత్రి సవిత పేర్కొన్నారు. చేనేతలకు ఆర్థికంగా మేలు చేకూర్చడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 85 వేల మందికిపైగా చేనేతలకు నేతన్న భరోసా పింఛన్ పథకం కింద నెలకు రూ.4 వేల చొప్పున అందజేస్తున్నట్టు ఆమె గుర్తు చేశారు. అలాగే ఉచిత విద్యుత్, 'నేతన్నల సేవ' పథకం కింద ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం కూడా అందిస్తున్నామని మంత్రి సవిత వివరించారు.