రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ, రత్న నిధి చారిటబుల్ ట్రస్ట్, వన్‌సైట్ ఎస్సిలార్ లక్సోటికా ఫౌండేషన్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ అధ్యక్షత వహించారు.

ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించనున్నారు.

2019 నుంచి ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 18 జిల్లాల పరిధిలో 800 పాఠశాలల్లో 6.8 లక్షలకు పైగా విద్యార్థులను పరీక్షించి, 63 వేలకుపైగా కళ్లద్దాలను పంపిణీ చేసినట్టు అధికారులు తెలిపారు.

పిల్లల్లో కంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందించడం ద్వారా వారి విద్యాభ్యాసంపై ప్రతికూల ప్రభావం పడకుండా చూడటమే ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.