నాసిక్, సెప్టెంబర్ 18: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం రిక్టర్ స్కేలుపై 3.3 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. జాతీయ భూకంప కేంద్రం (ఎన్సీఎస్) వివరాల ప్రకారం సాయంత్రం 7:10:15 గంటలకు, భూమికి సుమారు నాలుగు కిలోమీటర్ల లోతున ఇది నమోదైంది.
నాసిక్ నగరంతోపాటు మహారాష్ట్ర–గుజరాత్ సరిహద్దులోని సుర్గాణా తాలూకాలోని దంగ్రాలే, షిండే, రోకడ్పాడా ప్రాంతాల్లో ప్రకంపనలు అనుభవంలోకి వచ్చాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొన్ని ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయని జిల్లా యంత్రాంగం అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు నమోదు కాలేదు.
ఇదే ప్రాంతంలో ఆగస్టు 8న రాత్రి 4.3 తీవ్రతతో భూకంపం, మరుసటి రోజు ఉదయం 3.3 తీవ్రతతో ప్రకంపన వచ్చాయి. అంతకుముందు జూలై 25–28 తేదీల్లో, ఆగస్టు 6న కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. అప్పట్లో జిల్లా కలెక్టర్ ఆయుష్ ప్రసాద్, ప్రజలు భయపడవద్దని, పుకార్లు నమ్మవద్దని, అయితే జాగ్రత్తలు పాటించాలని కోరారు.
