ముంబై, అక్టోబర్ 23 (ఎక్స్‌ప్రెస్ టుడే): మహారాష్ట్రకు చెందిన నేవీ అగ్నివీరుల తొలి జాబితా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందిందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ శుక్రవారం ప్రకటించారు. ఆ జాబితాలోని 282 మందిని పోలీస్ కానిస్టేబుళ్లుగా నియమించి, ఉత్తర్వులు కూడా జారీ చేశామని తెలిపారు.

నియమితులైన వారిలో 150 మంది సీమన్ డెక్‌సైడ్, 132 మంది సీమన్ ఇంజిన్‌సైడ్ విభాగాలకు చెందినవారు. దేశం కోసం పోరాడే అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని, దాని ప్రకారం నిబంధనల్లో అవసరమైన మార్పులు చేశామని ఫడణవీస్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

నౌకాదళం నుంచి వైదొలగిన అగ్నివీరులను రాష్ట్ర తీరప్రాంత భద్రతా విభాగంలో నేరుగా చేర్చుకుంటామని, ఆసక్తి ఉన్న నౌకాదళ మాజీ సైనికులందరినీ చేర్చుకునేలా ప్రత్యేక కేసుగా గరిష్ఠ వయోపరిమితిని సడలిస్తామని సీఎం తెలిపారు. అగ్నిమాపక శాఖ, కారాగార భద్రతా దళాలు సహా వివిధ రాష్ట్ర భద్రతా విభాగాల్లో వీరిని చేర్చుకుంటామని వెల్లడించారు.