రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పాత విధానంలోనే బ్యాలెట్ పేపర్తో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది.
మండల, జిల్లా పరిషత్లతో పాటు మున్సిపల్ ఎన్నికలను సైతం బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని కమిషన్ యోచిస్తోంది. ఇందుకు సరిపడ బ్యాలెట్ బాక్సులు రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడంతో పొరుగు రాష్ట్రాల నుంచి సమకూర్చుకోవాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో చిన్న, పెద్దవి కలిపి దాదాపు 1.10 లక్షల బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉండగా, గ్రామ పంచాయతీ ఎన్నికలకు మాత్రమే వీటిలో అధిక భాగం సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తే కనీసం 1.50 లక్షల బ్యాలెట్ బాక్సులు అవసరమని కమిషన్ లెక్కగట్టింది.
గతంలో ఈవీఎంల ద్వారా స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చినా, రూ.400 కోట్లకుపైగా వ్యయం, సేకరణకు పట్టే సమయం దృష్ట్యా ఆ ఆలోచనను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తం 1,37,671 పోలింగ్ కేంద్రాలకు నాలుగు దశల్లో నిర్వహిస్తే 41,301 ఈవీఎం కంట్రోల్ యూనిట్లు, 82,602 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని అంచనా.