వర్షాలు సమృద్ధిగా కురవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ సూచన మేరకు నగరంలోని జిల్లా గోరక్షణ మహా సంఘం ఆవరణలో గాయత్రి గో సేవా సమితి ఆధ్వర్యంలో వరుణ యాగం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య యాగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మంత్రి టీజీ భరత్ సూచన మేరకు వరుణ యాగం నిర్వహించినట్లు తెలిపారు. యాగం ఫలించి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా గోరక్షణ మహా సంఘం అధ్యక్షురాలు ఇల్లూరు రాజలక్ష్మి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య, ఏపీఐఐసీ డైరెక్టర్, గాయత్రీ గోసేవ సమితి అధ్యక్షులు జగదీష్ గుప్తా, కార్యనిర్వహణ అధికారి శోభ, టీఎస్ విజయ్ కుమార్, గుండా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.