కర్నూలు, సెప్టెంబర్ 23: సేలం రైల్వే స్టేషన్‌లో రక్షించబడిన ఒక గుర్తుతెలియని బాలుడి తల్లిదండ్రులు లేదా సంరక్షకులను గుర్తించి, బాలుడిని కుటుంబంతో పునరేకీకరించేందుకు ప్రజలు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు విజ్ఞప్తి చేశారు.

  • 2026 మార్చి 19న సేలం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నం.4 వద్ద రైల్వే చైల్డ్ లైన్ బృందం బాలుడి రక్షణ
  • సేలం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు డాన్ బాస్కో అన్బు ఇల్లం, సేలం సంరక్షణలో బాలుడు
  • చెవిటి, మాట్లాడలేని స్థితిలో ఉన్న బాలుడు — మోచేతుల దిగువ భాగంలో రెండు చేతులు కోల్పోయి ఉన్నాడు
  • సాధారణ కమ్యూనికేషన్ పద్ధతుల ద్వారా వివరాలు తెలియజేయలేని పరిస్థితి, నిపుణుల సాయంతోనూ గుర్తింపు సాధ్యం కాలేదు
  • తమిళనాడు అధికారులతో అంతర్రాష్ట్ర సమన్వయం ద్వారా కుటుంబ పునరేకీకరణకు చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు కమిషన్ ఆదేశం

2026 మార్చి 19వ తేదీన సేలం రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారం నం.4 వద్ద రైల్వే చైల్డ్ లైన్ బృందం ఈ బాలుడిని రక్షించి, సేలం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు డాన్ బాస్కో అన్బు ఇల్లం, సేలం సంరక్షణలో ఉంచింది. ఈ బాలుడు చెవిటి మరియు మాట్లాడలేని స్థితిలో ఉండటంతో పాటు, రెండు చేతులను మోచేతుల దిగువ భాగంలో కోల్పోయి ఉన్నాడు. సాధారణ కమ్యూనికేషన్ పద్ధతుల ద్వారా మాట్లాడటం, రాయడం లేదా తన వివరాలను తెలియజేయడం బాలుడికి సాధ్యం కావడం లేదు. నిపుణుల సహాయం అందించినప్పటికీ ఇప్పటివరకు బాలుడి పేరు, కుటుంబ నేపథ్యం, స్వస్థలం తదితర వివరాలను నిర్ధారించలేకపోయారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్రంలోని సంబంధిత జిల్లా అధికారులను బాలుడి వివరాలను విస్తృతంగా ప్రచారం చేసి, బాలుడిని గుర్తించే విధంగా చర్యలు చేపట్టాలని, తమిళనాడు రాష్ట్రంలోని సంబంధిత అధికారులతో అంతర్రాష్ట్ర సమన్వయం ద్వారా బాలుడి తల్లిదండ్రులు/సంరక్షకులను గుర్తించి కుటుంబ పునరేకీకరణకు చర్యలు తీసుకోవాలని కోరింది.

కాబట్టి కర్నూలు జిల్లా ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, బాలల సంక్షేమ రంగంలో పనిచేస్తున్న సంస్థలు బాలుడిని అతని కుటుంబ సభ్యులను గుర్తించేందుకు తమవంతు సహకారం అందించాలని, బాలుడికి సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప బాలల సంరక్షణ అధికారులకు/చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తెలియజేయాలని కోరారు.