కర్నూలు, సెప్టెంబర్ 20: నీటి కష్టాలు ఉన్నప్పటికీ వినాయక నిమజ్జనానికి ప్రణాళికాబద్ధంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలు నగరంలోని రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడిని మంత్రి టీజీ భరత్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
- రాంబొట్ల దేవాలయం వద్ద వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి టీజీ భరత్
- కేసీ కెనాల్లో రెండు వైపులా గోడలు నిర్మించి ట్యాంక్ తరహాలో నీటి నిల్వ ఏర్పాట్లు
- నన్నూరు టోల్ ప్లాజా వద్ద హంద్రీనీవాలో సైతం నిమజ్జనానికి ఏర్పాట్లు
- నగరంలోని వినాయక మండపాలు, అన్నదాన కార్యక్రమాల సందర్శన
అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని దేవుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. కేసీ కెనాల్లో రెండు వైపులా గోడలు నిర్మించి, ట్యాంక్ తరహాలో నీటిని నిల్వ చేసి వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తెలిపారు.
దీంతో పాటు నన్నూరు టోల్ ప్లాజా వద్ద హంద్రీనీవాలో కూడా వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రజలు తమకు ఇష్టమైన ప్రాంతాల్లో వినాయక నిమజ్జనం చేసుకోవచ్చని మంత్రి తెలిపారు.
అనంతరం మంత్రి టీజీ భరత్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి, అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
