రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి కల్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాగృతి స్కీమ్ 2025 సభ్యులతో కలిసి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2026 ఈ ప్రపంచవ్యాప్త ఆచరణ యొక్క 60వ వార్షికోత్సవాన్ని సూచిస్తూ 'ప్రజలు, గ్రహం మరియు శ్రేయస్సు కోసం అక్షరాస్యత' అనే థీమ్‌తో సెప్టెంబర్ 8న జరుపుకుంటున్నామని ఆమె తెలిపారు. విద్యార్థులకు ప్రాథమిక హక్కులు, అటవీ హక్కులు, కాలుష్య నివారణ, కార్మిక హక్కులు, కనీస వేతనాలు, వినియోగదారుల రక్షణ వంటి చట్టలపై ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.
కనీస అక్షరాస్యత అవసరం: రీజినల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ లాలప్ప
కళాశాల రీజినల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ లాలప్ప మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాయడం, చదవడం వంటి కనీస అక్షరాస్యత కలిగి ఉండాలన్నారు. అనంతరం అక్షరాస్యతపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ మెల్విన్ జోన్స్ ఎన్జీవో సంస్థ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు సహకారంతో జడ్జి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
మట్టి వినాయకులపై అవగాహన, మొక్కల పెంపకం
పర్యావరణ కాలుష్య రహిత మట్టి వినాయక విగ్రహాలనే ప్రతి ఒక్కరూ పూజించాలని కోరుతూ వాటిపై అవగాహన పోస్టర్లను జడ్జి ఆవిష్కరించారు. అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. తర్వాత విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా విద్యార్థులతో కలిసి రుచి చూసిన జడ్జి, వారికి అందుతున్న ఆహారం నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల రీజినల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ లాలప్ప, కర్నూలు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ సతీష్ కుమార్ రెడ్డి, కల్లూరు మండల విద్యాధికారి శ్రీనివాసులు, డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ శారద, వెల్ఫేర్ హాస్టల్ అధికారి మద్దిలేటి, ఎన్జీవో ప్రతినిధి రాయపాటి శ్రీనివాసులు, న్యాయవాదులు వెంకట్రావు రాంపుల్లయ్య, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన, జడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ హుస్సేన్, ప్యారా లీగల్ వాలెంటీర్ హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
