కర్నూలు నగరంలో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా, ప్రశాంతంగా ముగిశాయి. నగరంలోని వినాయక ఘాట్‌తో పాటు కర్నూలు నగర శివారులోని నన్నూరు టోల్‌ప్లాజా వద్ద హంద్రీనీవా, ఉలిందకొండ వద్ద కూడా పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి తరలివచ్చిన భక్తులతో ఆయా ప్రాంతాలు సందడిగా మారాయి.

మూడు ప్రాంతాల్లో భారీగా నిమజ్జనం

నన్నూరు టోల్‌ప్లాజా వద్ద హంద్రీనీవాలో 1,050 వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. కర్నూలు నగరంలోని వినాయక ఘాట్‌ వద్ద కేసీ కెనాల్‌లో 1,000 వరకు విగ్రహాలు నిమజ్జనం చేశారు. అలాగే ఉలిందకొండ వద్ద 96 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు.

హంద్రీనీవాలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. అర్ధరాత్రి తర్వాత విగ్రహాల రాక పెరిగింది. నిమజ్జన ప్రాంతాల్లో అవసరమైన సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లను ఏర్పాటు చేశారు. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేశారు.

నీటి కొరత ఉన్న పరిస్థితుల్లోనూ ముందస్తు ప్రణాళికతో ప్రత్యామ్నాయ నిమజ్జన ప్రాంతాలను సిద్ధం చేయడం ద్వారా భక్తులకు సౌకర్యం కల్పించారు. హంద్రీనీవా, కేసీ కెనాల్‌, ఉలిందకొండ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిమజ్జన సదుపాయాలను భక్తులు వినియోగించుకున్నారు.