కర్నూలు, సెప్టెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌ను ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్యం అని, కర్నూలు జిల్లాను ఏవియేషన్, డ్రోన్, పారిశ్రామిక రంగాలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీఓ)ను కర్నూలులో ఏర్పాటు చేయడం చారిత్రాత్మక పరిణామమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఏవియేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. కేవలం విమానాశ్రయాల నిర్మాణమే కాకుండా, శిక్షణ, నిర్వహణ, గ్రౌండ్ ఆపరేషన్స్, విమానాశ్రయ నిర్వహణ తదితర అన్ని విభాగాలతో కూడిన ఏవియేషన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కర్నూలులో హిందుస్థాన్‌ గ్రూప్‌కు చెందిన ఓరియంట్‌ ఫ్లయింగ్‌ అకాడమీ ఎఫ్‌టీఓ ప్రారంభం కావడం రాష్ట్రంలోనే తొలి ఎఫ్‌టీఓగా ప్రత్యేకత సంతరించుకుందని పేర్కొన్నారు. దేశీయ విమానయాన రంగంలో గణనీయమైన వృద్ధి సాధించామని మంత్రి పేర్కొన్నారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాలు ఉండగా, ప్రస్తుతం ఈ సంఖ్య సుమారు 166కు చేరిందన్నారు. విమానాశ్రయాలు, విమానాలు, విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ విస్తరిస్తున్న ఏవియేషన్ రంగానికి అవసరమైన మానవ వనరులను సిద్ధం చేయడంలో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ల పాత్ర కీలకమన్నారు. దేశవ్యాప్తంగా ఎఫ్‌టీఓల సంఖ్యను, సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు.

కర్నూలు విమానాశ్రయం రాయలసీమ ప్రాంతంలో అనేక అభివృద్ధి అవకాశాలకు దోహదపడుతోందన్నారు. కర్నూలు కేంద్రంగా పారిశ్రామిక, తయారీ, ఏవియేషన్ రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. కియా మాన్యుఫాక్చరింగ్ యూనిట్, బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్, డిఫెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ తదితర సంస్థల కార్యకలాపాలతో పాటు ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ కూడా రావడం ద్వారా రాయలసీమలో విస్తృతమైన ఎకోసిస్టమ్ ఏర్పడుతోందన్నారు. కర్నూలులో ఎఫ్‌టీఓ ద్వారా ఏడాదికి 60 మందికి శిక్షణ అందించే సామర్థ్యం ఏర్పడటంతో పాటు ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, గ్రౌండ్ ఆపరేషన్స్, ఎయిర్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఏర్పడతాయన్నారు.

ఓర్వకల్లులో డ్రోన్‌ సిటీ ఏర్పాటు చేయడం జరుగుతోందని, తొలి దశలో 180 ఎకరాల్లో, రెండో దశలో 400 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. డ్రోన్‌ రంగానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా త్వరలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయన్నారు. అదే విధంగా మరిన్ని ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌టీఓ) ఏర్పాటు చేసేందుకు కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని, వాటికి అవసరమైన అనుమతులు కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఏవియేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. స్థానిక యువతకు వీలైనన్ని ఎక్కువ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి ఓరియంట్‌ ఏవియేషన్‌ సంస్థ ప్రతినిధులను కోరారు.

ఏవియేషన్‌, పారిశ్రామిక రంగాలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ హబ్‌లోకి మరిన్ని పరిశ్రమలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రాయలసీమలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు, పారిశ్రామికవేత్తలు గమనించాలని మంత్రి కోరారు. నీటి వనరులు, మౌలిక వసతులు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధితో ప్రాంతం మరింత పురోగతి సాధిస్తుందని మంత్రి తెలిపారు. ఓర్వకల్లు ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ సూచనల మేరకు స్థానిక ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. ఏవియేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు సహకరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఓరియంట్‌ ఏవియేషన్‌ సంస్థకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.