ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజినల్ ఆఫీస్ కర్నూలు, అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 117, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మెల్విన్ జోన్స్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కర్నూలు ఏ. క్యాంపులోని ఇందిరా గాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుందని, మట్టి వినాయక విగ్రహాల వినియోగంతో పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించవచ్చని అన్నారు. సహజసిద్ధమైన మట్టితో వినాయక విగ్రహాలను తయారు చేసి పూజించే సంస్కృతిని విద్యార్థుల్లో, ప్రజల్లో ప్రోత్సహించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
- విద్యార్థులకు ప్రాథమిక హక్కులు, కాలుష్య నివారణ, కార్మిక హక్కులు, వినియోగదారుల రక్షణ చట్టాలపై అవగాహన కల్పన
- లీగల్ సర్వీసెస్ టోల్ ఫ్రీ నెంబర్ 15100పై విద్యార్థులకు వివరణ
- పర్యావరణహిత మట్టి విగ్రహాలను వినియోగించాలని పీసీబీ రీజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ కుమార్ రెడ్డి పిలుపు
- విద్యార్థుల్లో సృజనాత్మకత, పర్యావరణ స్పృహ పెంచేందుకు మట్టి విగ్రహాల తయారీ పోటీలు ఉపయోగకరమని జిల్లా గవర్నర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ వ్యాఖ్య
- జాతీయ పోషణ వారోత్సవాల్లో భాగంగా గుడ్డు తినడం వల్ల కలిగే పోషకాలపై డాక్టర్ బాలస్వామి వివరణ — ప్రతి విద్యార్థి రోజుకో గుడ్డు తినాలని సూచన
భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణం
ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, రాబోయే తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో పీసీబీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ, లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు ఇస్సాక్, జర్నలిస్టులు బాబురావు, సురేష్, పాఠశాల హెడ్మాస్టర్ రోజా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
