ఆయా శాఖలు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను కచ్చితంగా సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ సూచనల అమలు, కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు అంశాలపై జిల్లా కలెక్టర్ సమగ్ర సమీక్ష నిర్వహించారు.

నైపుణ్యాభివృద్ధి, వాటర్ సెక్యూరిటీపై దృష్టి

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలకు సంబంధించి స్పష్టమైన రోడ్‌మ్యాప్, ప్రత్యేక వ్యూహాలను రూపొందించాలని ఆదేశించారు. కెపాసిటీ బిల్డింగ్ శిక్షణలను నిర్ణీత సమయంలో నిర్వహించడంతో పాటు పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నారు. జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వాటర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. అవసరమైన చోట్ల కొత్త బోర్ల తవ్వకానికి బదులుగా అందుబాటులో ఉన్న నీటి వనరులను సంరక్షించడం, చెరువులను నింపడం, డీపెనింగ్, ఫ్లషింగ్ వంటి చర్యలను చేపట్టాలని సూచించారు. జలధార, జలహారతి కార్యక్రమాలను ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని అమలు చేయాలని, ఫామ్ పాండ్స్, పెర్కొలేషన్ ట్యాంక్స్, కంటిన్యూయస్ కాంటూర్ ట్రెంచెస్ తదితర నిర్మాణాల ద్వారా భూగర్భ జలాల రీచార్జ్‌ను పెంచాలని ఆదేశించారు. చేపట్టిన పనులకు సంబంధించి జియో ట్యాగింగ్, వినియోగ వివరాల నమోదు తదితర ప్రక్రియలను నూరు శాతం పూర్తి చేయాలని తెలిపారు.

నేచురల్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించేందుకు వ్యవసాయం, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మత్స్య, పశుసంవర్ధక తదితర శాఖల మధ్య సమన్వయంతో కన్వర్జెన్స్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఫామ్ పాండ్స్, క్యాటిల్ షెడ్స్, సంకెన్ పిట్స్ వంటి పనులతో పాటు తక్కువ నీటితో సాగు చేసే పంటలు, తక్కువ వ్యవధి పంటలు, సేంద్రీయ విత్తనాల వినియోగం, సహజ వ్యవసాయ విధానాలపై రైతులకు శిక్షణ, అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ క్యాంపెయిన్, వ్యవసాయం, ఉద్యానవనం, అటవీ శాఖలు చేపడుతున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలన్నారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పశుసంపదకు అవసరమైన పశుగ్రాసం అందుబాటులో ఉండేలా కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

పరిశ్రమలు, పర్యాటకం, పారిశ్రామిక కారిడార్లపై చర్యలు

పరిశ్రమలకు అవసరమైన రోడ్లు, నీటి సరఫరా తదితర మౌలిక వసతులను త్వరగా పూర్తి చేసి, సింగిల్ విండో క్లియరెన్సులను ఫాస్ట్‌ట్రాక్‌లో పరిష్కరించాలని సూచించారు. జాతీయ రహదారులు, బైపాస్‌లు, జంక్షన్లు, పారిశ్రామిక కారిడార్లకు సంబంధించిన భూసేకరణ సమస్యలను పరిష్కరించడంతో పాటు కాంపాక్ట్ బ్లాక్స్, ఎలియనేషన్ భూములు, పెండింగ్ ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. 32 ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన MoU, భూకేటాయింపు, క్లియరెన్స్ ప్రక్రియలను వేగవంతం చేయాలని, PMFME కింద మంజూరైన రుణాలను అర్హులైన లబ్ధిదారులకు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గార్గేయపురం బోటింగ్, ఓర్వకల్లు రాక్ గార్డెన్, పెద్దతుంబలం పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన భూ ప్రతిపాదనలపై పూర్తి వివరాలు సేకరించి త్వరగా పరిష్కరించాలని తెలిపారు. అక్టోబర్‌లో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి వేగంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

వ్యర్థాల నిర్వహణ, విద్య, సంక్షేమ పథకాలపై ఆదేశాలు

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సైట్లకు భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని, బల్క్ వేస్ట్ జనరేటర్లు నిబంధనల ప్రకారం సొంత వ్యర్థాల ప్రాసెసింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్, కూరగాయలు–పండ్ల వ్యర్థాలతో కంపోస్ట్ తయారీ, డ్రెయిన్ల శుభ్రత, గ్రీన్ కవర్ పెంపు వంటి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. హాస్టళ్లు, పాఠశాలల నిర్మాణాలు, ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు తదితర పనులను వేగంగా పూర్తి చేయాలని, పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు రెమిడియల్ క్లాసులు, బ్రిడ్జ్ కోర్సులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

'అన్నదాత సుఖీభవ' పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ ప్రయోజనం అందేలా ఆధార్ సీడింగ్, భూమి వివరాల పరిశీలనను వేగవంతం చేయాలని ఆదేశించారు. అంగన్‌వాడీలు, పోషణ్ ట్రాకర్ డేటా, పాఠశాలలు–అంగన్‌వాడీల మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గ్రామ సభల్లో జనాభా నిర్వహణ, కుటుంబ సంక్షేమం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రత్యేక అజెండా అంశంగా చేర్చాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు. వక్ఫ్ భూములను ఆక్రమణల నుంచి రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మీద్ పోర్టల్‌లో నమోదైన భూముల వివరాలు, రక్షణ చర్యలు, మిగిలిన భూముల గణాంకాలను స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు.

సమీక్షలో చర్చించిన అన్ని అంశాలపై 10 రోజుల్లోగా ఖచ్చితమైన Action Taken Report (ATR) సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటనారాయణమ్మ, సిపిఓ భారతి, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.