జిల్లాలోని విద్యార్థులు మరియు సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, వీరిపై గట్టిగా నిఘా ఉంచి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ, సంక్షేమ వసతి గృహాల మరియు ఈగల్ టీమ్ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ... జిల్లాలోని పాఠశాలలు, కాలేజీలు, సంక్షేమ వసతిగృహాలలోని విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టళ్లలో విద్యార్థుల ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. యువత భవిష్యత్తును కాపాడడం బాధ్యతగా భావించాలన్నారు. మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే అనర్థాలు, కేసుల నమోదుపై విద్యార్థులందరికీ పూర్తిగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. వాల్ పోస్టర్లు, స్టిక్కర్ల ద్వారా మరియు మీడియా ద్వారా ఈ విషయాన్ని జిల్లాలో అందరికీ తెలిసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో డ్రగ్స్ లేకుండా చర్యలు చేపట్టాలని ఈగల్ టీమ్‌ను ఆదేశించారు. విద్యాసంస్థల పరిసరాలలో ఉన్న దుకాణాలపై గట్టి నిఘా ఉంచి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
ఆదోని రెవెన్యూ డివిజన్లోని చిప్పగిరి, పెద్ద హరివాణం, హాలహర్వి, ఆలూరు తదితర మండలాల్లోని కొన్ని గ్రామాల రైతులు మరియు ఇతరులు రహస్యంగా గంజాయి సాగు చేస్తున్నట్టు సమాచారం ఉందని, సాగు చేస్తున్నట్లయితే వారిపై వెంటనే కేసులు పెట్టి అరికట్టే చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి వరలక్ష్మిని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
సంక్షేమ శాఖ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ... సంక్షేమ వసతి గృహాల్లోని సిబ్బంది ఎటువంటి అవకతవకలకు పాల్పడరాదని, విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని, వారికి మంచి పౌష్టికాహారము, తాగునీరు అందించాలని ఆదేశించారు. వసతి గృహాల్లో మంచి సౌకర్యాలు, నీటి వసతి, మెష్‌ల ఏర్పాటు, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండడం వంటి ప్రశాంత వాతావరణం కలిగి ఉండే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వసతి గృహాలపై అవసరమైతే థర్డ్ పార్టీ ఆడిట్ చేయిస్తామని హెచ్చరించారు. వసతి గృహాలకు కావలసిన ఏర్పాట్లకు సంబంధించిన నివేదికలతో రావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
