రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ అంశాలపై ఆర్డీఓలు, తహసిల్దార్లు, రీ-సర్వే డిప్యూటీ తహసిల్దార్లతో జిల్లా స్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రీ-సర్వే, 22ఏ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఇప్పటివరకు 22ఏ కింద దాదాపు 3,000 కేసులను పూర్తి చేసినప్పటికీ, వెబ్‌ల్యాండ్ 2.0లో అవసరమైన మార్పులు చేయాల్సి ఉన్నందున తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. శనివారం నాటికి తహసీల్దార్లు అందరూ జాయింట్ కలెక్టర్ అనుమతి కోసం సంబంధిత ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. 22ఏకి సంబంధించి ప్రస్తుతం ఎస్‌ఎల్‌ఏ గడువు దాటి 94 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని శనివారం నాటికి తప్పనిసరిగా పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

రీ-సర్వేలో 286 గ్రామాల్లో ప్రక్రియ పూర్తి

రీ-సర్వేలో ఇప్పటివరకు 286 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయిందని, సుమారు 2 లక్షల పాస్ పుస్తకాలను పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. మిగిలిన 150కి పైగా గ్రామాల్లో రీ-సర్వే ప్రక్రియను మార్చి నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఫేజ్‌–4లో తహసీల్దార్ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఫేజ్‌–5లో వీఆర్‌వో లాగిన్‌లో ఉన్న పెండింగ్‌లను త్వరితగతిన క్లియర్ చేయాలని సూచించారు. 40, 50 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న 11 గ్రామాల ప్రక్రియను వచ్చే వారంలోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆర్డీఓ, తహసీల్దార్, వీఆర్వో లాగిన్లలో ఏ గ్రామానికి సంబంధించిన ప్రక్రియ కూడా 30 రోజులకు మించి పెండింగ్‌లో ఉండకూడదని ఆదేశించారు.

ఫేజ్–6లో 44 గ్రామాలు — డిసెంబర్ గడువు

ఫేజ్‌–6 కింద 44 గ్రామాలను ఎంపిక చేశారని, ఒక్కో గ్రామం సగటున 8,000 నుంచి 10,000 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నందున ప్రత్యేక కార్యాచరణతో గ్రౌండ్ ట్రూథింగ్ పనులను చేపట్టాలన్నారు. మరుసటి రోజు నుండి 80 నుంచి 100 బృందాలను రంగంలోకి దించి, ప్రతి బృందం రోజుకు సుమారు 35 ఎకరాల చొప్పున గ్రౌండ్ ట్రూథింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫేజ్‌–6 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూథింగ్ ప్రక్రియను డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతిరోజు ఎన్ని బృందాలు ఎంత మేరకు సర్వే పనులు పూర్తి చేస్తున్నాయో క్షేత్రస్థాయిలో నిశితంగా పర్యవేక్షించాలన్నారు.

ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి

రెవెన్యూ అంశాలపై ప్రజల్లో సానుకూల ప్రజాభిప్రాయం మెరుగుపడేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, ప్రశ్నలకు సమర్థవంతమైన పరిష్కారాలు అందించి, ప్రభుత్వ సేవలపై ప్రజలకు నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం రెవెన్యూ విభాగానికి సంబంధించి రీ-ఓపెన్ శాతం 9.5 శాతంగా ఉందని, దీనిని గణనీయంగా తగ్గించేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని కలెక్టర్ తహసిల్దార్లను ఆదేశించారు.