కర్నూలు, సెప్టెంబర్ 23: జిల్లాలో కొనసాగుతున్న రీ-సర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రీ-సర్వే, సర్‌ ప్రక్రియ, పెన్షన్, అక్షరాంధ్ర తదితర అంశాలపై కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చివరి దశలో ఉన్న 44 గ్రామాల రీ-సర్వే ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. 100 బృందాలను అందుబాటులోకి తీసుకువచ్చి, డిసెంబర్ నాటికి గ్రౌండ్ ట్రూథింగ్‌ పనులను పూర్తి చేయాలన్నారు. ప్రతిరోజూ పురోగతిని నివేదించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫోటో మానిటరింగ్ పెండెన్సీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆలూరు, ఆదోని బీఎల్‌ఓల వద్ద, ఆలూరు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ ఈఆర్‌ఓల వద్ద పెండెన్సీ అధికంగా ఉన్నందున సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్నారు. సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ ఉంటే వాటిని అదే రోజు సాయంత్రం లోపు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఫారం-6, 7, 8, 6ఎలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆలూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ ఈఆర్‌ఓలను ఆదేశించారు. రోల్ అబ్జర్వర్ రెండో విడత పర్యటనలో భాగంగా ఫారాలను పరిశీలించే అవకాశం ఉన్నందున, సంబంధిత ఈఆర్‌ఓలు అన్ని దరఖాస్తులను సరైన పత్రాలతో సిద్ధంగా ఉంచాలన్నారు.

పెన్షన్ దరఖాస్తులకు సంబంధించి సంక్షేమ శాఖ పరిధిలో పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, అర్హత ఉన్న దరఖాస్తులను మాత్రమే సిఫార్సు చేయాలని, నిబంధనల ప్రకారం వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. 500కు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న మండలాలు 11 ఉన్నాయని, వీటిలో ఆదోని, తుగ్గలి, పత్తికొండ మండలాల్లో 1,000కు పైగా పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. సంబంధిత ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్‌ను వీలైనంత త్వరగా సున్నాకు తీసుకురావాలన్నారు. తహసీల్దార్ల పరిధిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి, కేటాయించిన గడువులోనే స్క్రూటినీ, తుది నిర్ణయం పూర్తి చేయాలని, అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.

అక్షరాంధ్ర కార్యక్రమానికి సంబంధించి కొన్ని మండలాల్లో యాప్ హాజరు నమోదు తక్కువగా ఉన్నందున, వారిని త్వరగా యాప్‌లోకి తీసుకురావడంతో పాటు తరగతులు క్రమం తప్పకుండా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్రకు సంబంధించిన పుస్తకాల పంపిణీలో భాగంగా ప్రభుత్వం పంపిన పుస్తకాలను మండలాలు, సంబంధిత కేంద్రాలకు త్వరగా చేరవేయాలన్నారు. మంత్రాలయం, కోసిగి, వెల్దుర్తి, తుగ్గలి, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, దేవనకొండ, ఆదోని, నందవరం, ఆలూరు తదితర ప్రాంతాల్లో పెండింగ్ హాజరు నమోదును వేగవంతం చేయాలని, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. తక్కువ అక్షరాస్యత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ సంబంధిత ఎంపీడీఓలను ఆదేశించారు.