కర్నూలు, అక్టోబర్ 19 (ఎక్స్‌ప్రెస్ టుడే): కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూష సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తీపాటి నాగరాజు, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, విజయ ప్రత్యూషను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. బీటెక్ చదివిన ఉన్నత విద్యావంతురాలైన ఆమె, గత ఎన్నికల్లో ఎన్నో కష్టాలు ఎదురైనా కార్పొరేటర్‌గా విజయం సాధించారని, కార్పొరేటర్‌గా తన వార్డు అభివృద్ధికి కృషి చేశారని ఆయన పేర్కొన్నారు.

దివంగత రామకృష్ణ తన వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేసిన మంత్రి, ఆయన కుమార్తె అయిన విజయ ప్రత్యూషకు ప్రజలు ఆశీర్వాదం అందించాలన్నారు.

గెలిచిన వార్డుతో సంబంధం లేకుండా కూటమి ప్రభుత్వంలో అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కర్నూలు నగరంలోని 68 వార్డుల్లోనూ అభివృద్ధి జరగాలంటే కూటమి బలపడాలని, మున్సిపల్ కార్పొరేషన్‌లో అభివృద్ధి పనులు సజావుగా సాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అభివృద్ధికి అడ్డంకులు సృష్టించే వారిని ప్రజలు గమనించాలని, 2024 ఎన్నికల్లో కూటమికి ఇచ్చిన మద్దతునే మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. కూటమిలోని అభ్యర్థుల మధ్య ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని, నామినేషన్లు, ఉపసంహరణ ప్రక్రియ ముగిసేలోగా అన్ని సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కర్నూలు నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొన్నారు.