ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కనీస నీటిమట్టానికి మించి 146.55 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా, అందులో తమ రాష్ట్రానికి 70 శాతం వాటా కింద 115.70 టీఎంసీలు దక్కుతాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణకు 30 శాతం వాటా కింద కేవలం 30.85 టీఎంసీలే ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు ఏపీ 13.62 టీఎంసీలు, తెలంగాణ 20.06 టీఎంసీలు వాడుకున్నట్లు వెల్లడించింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశం కృష్ణా ట్రిబ్యునల్-2లో అపరిష్కృతంగా ఉండటంతో, తాత్కాలికంగా ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం చొప్పున జలాలు సర్దుబాటు చేయాలని గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే.

శ్రీశైలం, సాగర్, పులిచింతల జలాశయాల నుంచి కలిపి మొత్తం 184.74 టీఎంసీలు లభ్యతలో ఉన్నట్లు లెక్కలు వేసింది. మిగిలిన మూడు జలాశయాల్లో 115.7 టీఎంసీలు లభ్యతలో ఉన్నాయని, అందులో తమ రాష్ట్రానికి 70 శాతం వాటా మిగిలి ఉందని పేర్కొంది.

తమ వాటా నుంచి అక్టోబర్ 31 వరకు తాగునీటి అవసరాలకు 47 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా పరీవాహక ప్రాంతంలో సాధారణం కంటే 49 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, రాబోయే నెలల్లోనూ వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమివ్వాలని కృష్ణా బోర్డును కోరింది.