కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం శ్రీకాకుళం ఉమెన్స్ కళాశాల హాస్టల్ భవనాలను సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. బీసీ హాస్టల్‌–1, 2, 3తో పాటు ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను సందర్శించిన ఆయన, విద్యార్థినులకు అందుతున్న వసతులు, హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు.

హాస్టల్ భవనాల్లో కలియతిరుగుతూ విద్యార్థినులతో, వార్డెన్లు, సిబ్బందితో నేరుగా మాట్లాడి వారి సమస్యలను మంత్రి తెలుసుకున్నారు. విద్యార్థినులకు అందుతున్న భోజనం, తాగునీరు, గదులు, పారిశుధ్యం, ఇతర మౌలిక వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

హాస్టళ్లలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు, సిబ్బందికి రామ్మోహన్ నాయుడు పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన వసతులు కల్పించడంతో పాటు, హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థినుల అవసరాలు, సౌకర్యాల విషయంలో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

త్వరలోనే మళ్లీ హాస్టల్ భవనాలను పరిశీలిస్తానని, అప్పటికి పురోగతి కనిపించాలని మంత్రి సిబ్బందిని ఆదేశించారు. చివరగా, విద్యార్థినులు చదువుల్లో మరింత రాణించాలని ఆకాంక్షిస్తూ వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.