రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల బలోపేతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాళిలో డిగ్రీ కళాశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటబొమ్మాళి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలన్న తన చిరకాల కోరిక సాకారం కావడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. యువతకు నాణ్యమైన ఉన్నత విద్య అందించడంతో పాటు వారికి విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పరిశ్రమల స్థాపన అవసరమని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల రూ.2,600 కోట్ల పెట్టుబడితో 450 ఎకరాల విస్తీర్ణంలో కోరమండల్ పరిశ్రమను మూలపేటలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. దేశంలోని ప్రముఖ పరిశ్రమలు మూలపేటలో తమ పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని, రానున్న రోజుల్లో మూలపేట పోర్టు ప్రాంతం పరిశ్రమల హబ్‌గా అభివృద్ధి చెందనుందని అన్నారు.
విద్యతోనే యువతకు బంగారు భవిష్యత్తు
విద్యతోనే యువతకు బంగారు భవిష్యత్తు సాధ్యమవుతుందని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నత విద్యకు సంబంధించి సమగ్ర విధానాలను అమలు చేస్తూ ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య అందుబాటులో ఉండేలా చారిత్రాత్మక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. కోటబొమ్మాళి డిగ్రీ కళాశాలకు త్వరలో శాశ్వత భవనం నిర్మించేందుకు చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. ఐదు ఎకరాల విస్తీర్ణంలో కళాశాల భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని చెప్పారు. యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా అవసరమైన కోర్సులను డిగ్రీ కళాశాలలో మంజూరు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ప్రజా ప్రభుత్వంగా అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి అన్నారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనాన్ని రూపుమాపి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడినప్పటికీ వంశధార కాలువల నుంచి సాగునీటిని అందించి రైతులకు అండగా నిలిచామని మంత్రి గుర్తు చేశారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పంట బీమా నమోదుకు ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించిందని తెలిపారు. జిల్లాలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శత శాతం పంట బీమా నమోదు చేసుకోవాలని మంత్రి సూచించారు.
కొత్తమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు
కోటబొమ్మాళిలోని కొత్తమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులను చేపట్టి గత ఏడాది కంటే మరింత వైభవంగా ఈ ఏడాది కొత్తమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
అనంతరం డిగ్రీ కళాశాల ఆవరణలో మంత్రి చేతులమీదుగా మొక్కలు నాటారు.
