విశాఖపట్నం, ఆగస్టు 28: జాతీయ నేత్రదాన పక్షోత్సవం–2026లో భాగంగా విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ నర్సింగ్ సిబ్బందికి నేత్రదానం ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

  • కింగ్ జార్జ్ హాస్పిటల్ నర్సింగ్ సిబ్బందికి నేత్రదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. ఐ. వాణి హాజరు
  • మోహ్సిన్ ఐ బ్యాంక్ సిబ్బంది, పార మెడికల్ ఆప్తాల్మిక్ అధికారుల భాగస్వామ్యం
  • నేత్రదానం ద్వారా మరణానంతరం ఇద్దరు అంధులకు చూపును అందించే అవకాశం

ఈ కార్యక్రమానికి కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. ఐ. వాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూపరింటెండెంట్ ఇన్‌చార్జ్ డా. జ్యోతిర్మయి, మోహ్సిన్ ఐ బ్యాంక్ మేనేజర్ అభినీత్ జైన్ వారి సిబ్బంది మరియు పార మెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్లు ఎం. ఉమా శ్రీనివాస్, ఆర్. సురేష్, కౌన్సిలర్లు బి. పూర్ణిమ, సి.హెచ్. సుజాత పాల్గొని నేత్రదానం ద్వారా కలిగే ప్రయోజనాలు, నేత్రదానం చేయాల్సిన విధానం తదితర అంశాలపై నర్సింగ్ సిబ్బందికి అవగాహన కల్పించారు.

నేత్రదానం ద్వారా మరణానంతరం ఇద్దరు అంధులకు చూపును అందించవచ్చని, ప్రజల్లో నేత్రదానంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో వివరించారు.