రియాద్, సెప్టెంబర్ 18: ఇరాన్ మద్దతున్న యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా గురువారం సరిహద్దు దాటి పరస్పరం దాడులు చేసుకున్నాయి. తాయిఫ్ నగరం మీదుగా వెళుతున్న డ్రోన్‌ను అడ్డుకున్నప్పుడు పడిన శిథిలాల వల్ల సౌదీలో నివసిస్తున్న ఒక యెమెన్ పౌరుడు మరణించాడని సౌదీ పౌర రక్షణ విభాగం తెలిపింది. గత వారం రోజులుగా జరుగుతున్న హౌతీ దాడుల్లో సౌదీ ప్రకటించిన తొలి మరణం ఇదే.

సరిహద్దుకు దగ్గరగా ఉన్న హజ్జా ప్రావిన్స్‌లో ఎర్ర సముద్ర తీరం సమీపంలో సౌదీ వైమానిక దాడులు జరిగాయని హౌతీల అధీనంలోని టీవీ నివేదించింది.

ఈ ఘర్షణల కారణంగా గత రెండు వారాల్లో యెమెన్ లోపలే కనీసం 1,12,000 మంది నిరాశ్రయులయ్యారని ఐరాస వలస సంస్థ శుక్రవారం తెలిపింది. వారం రోజుల్లోపే సుమారు 3,000 మంది గల్ఫ్ ఆఫ్ ఏడెన్ దాటి ఆఫ్రికాలోని జిబౌటీకి చేరుకున్నారని ఐరాస శరణార్థుల సంస్థ ప్రతినిధి వెల్లడించారు.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చైనా పర్యటనలో ఉండగా, సౌదీ అరేబియా విజ్ఞప్తి మేరకు హౌతీలను అదుపు చేయడంలో సహకరించాలని చైనా బుధవారం ఇరాన్‌ను రహస్యంగా కోరిందని ఇరాన్ వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి. తమ ఇంధన రవాణా మార్గాల్లో ఘర్షణ మరింత విస్తరించకుండా నిరోధించడమే చైనా ఉద్దేశమని ఆ వర్గాలు పేర్కొన్నాయి.