వాషింగ్టన్, నవంబర్ 7 (ఎక్స్‌ప్రెస్ టుడే): ఇరాన్ భూ సరిహద్దులు, కాస్పియన్ సముద్రం ద్వారా అధునాతన ఆయుధాలు, ద్వంద్వ వినియోగ సాంకేతికత, ఆంక్షలున్న వస్తువుల రవాణాను అడ్డుకునేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ‘టాస్క్ ఫోర్స్ ఐరన్ గేట్’ను ఏర్పాటు చేసినట్లు శనివారం ప్రకటించింది. సెంట్కామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ఆదేశాల మేరకు ఈ దళాన్ని ఏర్పాటు చేశారు.
ఫ్లోరిడాలోని టాంపా కేంద్రంగా పనిచేసే ఈ దళంలో సుమారు 20 మంది సైనిక, పౌర సిబ్బంది ఉంటారు. ఇతర అమెరికా ప్రభుత్వ సంస్థలతో కలిసి వారు అక్రమ ఆదాయ మార్గాలనూ అడ్డుకునేందుకు పనిచేస్తారు. సముద్రంలో ఇరాన్‌పై అమలు చేస్తున్న కఠిన నౌకాదిగ్బంధనం విజయవంతమైందనడానికి ఈ కొత్త దళం ఏర్పాటు నిదర్శనమని కూపర్ వ్యాఖ్యానించారు.
జూలైలో ప్రకటించిన నౌకాదిగ్బంధనం అరేబియా గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ తీరాల్లోని ఇరాన్ ఓడరేవులను కవర్ చేస్తుండగా, కొత్త టాస్క్ ఫోర్స్ భూ సరిహద్దులు, కాస్పియన్ సముద్ర మార్గాలపై దృష్టి సారిస్తుంది. ఈ చర్యతో ఇరాన్‌పై ఒత్తిడిని సముద్రం నుంచి భూమార్గాలకూ విస్తరించినట్లయింది.