న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌కు ఆంక్షల సడలింపు, నిలిపివేసిన నిధుల విడుదలకు తాను ఎలాంటి ప్రతిపాదన చేయలేదని స్పష్టం చేశారు. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను సడలించేందుకు అమెరికా సిద్ధమైందని వస్తోన్న వార్తలను ఆయన ఖండించారు. "ఇది అవాస్తవం. నేను వారికి హామీ ఇవ్వలేదు" అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా అధికారులు మాత్రం ఇరాన్‌తో పరోక్ష చర్చలు కొనసాగుతున్నట్లు తెలిపారు. "ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఈ సంప్రదింపులు జరుగుతున్నాయి. అణు కార్యక్రమంపై ఇరాన్ స్పష్టమైన హామీలు ఇవ్వాలని అమెరికా కోరుతోంది" అని చెబుతున్నారు.

ఇరాన్ దాడుల్లో యూఎస్ సైనికులకు గాయాలు: ఇరాన్ దాడిలో ఎనిమిది మంది అమెరికా (యూఎస్) సైనికులు తీవ్రంగా గాయపడిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. సెప్టెంబరు 14న హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. దాడి సమయంలో అందులో ఉన్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనను అమెరికా ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించనప్పటికీ.. తాజాగా సైనికుల గాయాల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ఇది బయటపడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

యుద్ధ తీవ్రతను తక్కువ చేసి చూపించడానికే ట్రంప్ ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెట్టిందనే విమర్శలు వస్తున్నాయి. హర్మూజ్ జలసంధి సంక్షోభం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఖతార్ మధ్యవర్తుల ద్వారా అమెరికాతో ఇరాన్ మరోసారి పరోక్ష చర్చలు జరిపిందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. న్యూయార్క్‌లో జరిగిన ఈ చర్చలకు సంబంధించి అమెరికా స్పందన కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే సమాధానం రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.