మాస్కో, అక్టోబర్ 17 (ఎక్స్‌ప్రెస్ టుడే): రష్యాలోని కమ్‌చత్కా ద్వీపకల్పంలో శుక్రవారం శక్తిమంతమైన భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సుమారు 3.35 గంటలకు ఇది నమోదైంది.

యూరోపియన్–మెడిటరేనియన్ భూకంప కేంద్రం (ఈఎంఎస్‌సీ) వివరాల్లో దీని తీవ్రత 6.9గా ఉండగా, ఇతర సంస్థలు 7.0గా నమోదు చేశాయి. భూకంప కేంద్రం విల్యుచిన్స్క్‌కు సుమారు 123 కిలోమీటర్ల నైరుతి దిశలో, 140 కిలోమీటర్ల లోతులో ఉంది. కమ్‌చత్కా ప్రధాన నగరం పెట్రోపావ్లోవ్స్క్–కమ్‌చత్స్కీకి 146 కిలోమీటర్ల దూరంలో ఇది సంభవించింది.

అమెరికా జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రం సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. నష్టం లేదా ప్రాణనష్టం గురించి వెంటనే ఎలాంటి సమాచారం అందలేదు.