సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం, నైరుతి ప్రాంతంలోని అబ్హా విమానాశ్రయంపై జరిగిన దాడుల్లో ముగ్గురు మృతి చెందగా, 36 మంది గాయపడ్డారని సౌదీ సాధారణ పౌర విమానయాన అథారిటీ (జీఏసీఏ) వెల్లడించింది.
అక్టోబర్ 6, 7 తేదీల్లో ఈ రెండు విమానాశ్రయాలు లక్ష్యంగా దాడులు జరిగినట్లు జీఏసీఏ తెలిపింది. అబ్హాలో మొరాకో, అల్జీరియా దేశాలకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందగా 28 మంది గాయపడ్డారు; రియాద్‌లో సూడాన్‌కు చెందిన ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో సౌదీ పౌరులతో పాటు వివిధ దేశాల ప్రవాసులు ఉన్నారు.
ఇరాన్ మద్దతున్న యెమెన్ హూతీలు ఈ రెండు విమానాశ్రయాలపై దాడులు చేసినట్లు ప్రకటించుకున్నారు. రియాద్ వైపు వచ్చిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నామని, సనాలో దాడులకు వాడిన లాంచ్ ప్లాట్‌ఫాంను ధ్వంసం చేశామని సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది.
ప్రతీకారంగా యెమెన్‌లోని సాదా, హొదైదా, అల్‌జౌఫ్, మారిబ్ ప్రాంతాల్లో హూతీల 82 సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు కూటమి ప్రకటించింది. వీటిలో సాదాలో పర్వతాల్లో ఉన్న 11 బాలిస్టిక్ క్షిపణి నిల్వ కేంద్రాలు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, ఆయుధ డిపోలు ఉన్నాయి.
రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సౌదీలోని అమెరికన్లకు మరోసారి భద్రతా హెచ్చరిక జారీ చేసింది.