బ్రస్సెల్స్, సెప్టెంబర్ 18: క్షిపణులు, డ్రోన్ల కొనుగోలు కోసం ఉక్రెయిన్‌కు శుక్రవారం 3.3 బిలియన్ యూరోలు విడుదల చేయనున్నట్లు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ గురువారం ప్రకటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో చర్చల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. తమ రక్షణ వ్యవస్థల పటిష్ఠతకు ఇవి కీలక అడుగులని, చర్చలు చాలా ఫలప్రదంగా జరిగాయని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.

ఉక్రెయిన్ నగరాలపై రష్యా దాడుల పరంపర కొనసాగుతోంది. కీవ్‌కు పశ్చిమాన జైటోమిర్ ప్రాంతంలోని కొరోస్టెన్ పట్టణం సమీపంలో ఉన్న ఒక పారిశ్రామిక పార్కుపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారని ప్రాంత గవర్నర్ విటాలీ బునెచ్కో తెలిపారు.

మరోవైపు, ఉక్రెయిన్‌కు మద్దతిస్తున్న యూరప్ దేశాలపై రష్యా 'హైబ్రిడ్ దాడులు' చేయాలని యోచిస్తోందని పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ హెచ్చరించారు. నాటో దేశాల సంకల్పాన్ని బలహీనపరచడానికి ఆ దాడులను 'అనుకోకుండా జరిగినవి'గా చూపే ప్రయత్నం చేస్తారని ఆయన అన్నారు.