బ్రస్సెల్స్, నవంబర్ 6 (ఎక్స్‌ప్రెస్ టుడే): యూరోపియన్ యూనియన్ (ఈయూ) 93.5 బిలియన్ యూరోల పరిశోధన, ఆవిష్కరణల కార్యక్రమం ‘హారిజన్ యూరప్‌’లో భారత్ అనుబంధ సభ్యత్వానికి సంబంధించిన చర్చలను యూరోపియన్ కమిషన్, భారత్ విజయవంతంగా ముగించాయి.

అనుబంధ సభ్యత్వం అనేది హారిజన్ యూరప్ కింద ఈయూయేతర దేశాలకు ఈయూ అందించే అత్యంత సన్నిహిత సహకార రూపం. దీని ద్వారా అనుబంధ దేశాల సంస్థలు, ఒప్పందం పరిధిలోకి వచ్చే రంగాల్లో ఈయూ సంస్థలతో సమాన హోదాలో పాల్గొనవచ్చు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్వేషణాత్మక చర్చలు ప్రారంభం కాగా, జూలై 17న అధికారిక చర్చలు మొదలయ్యాయి. తాజా పురోగతితో అనుబంధ ఒప్పందంపై సంతకాలకు మార్గం సుగమమైంది. అవసరమైన ప్రక్రియలు పూర్తయ్యాక 2027 జనవరి నుంచి భారత్ అనుబంధ సభ్యత్వం అమల్లోకి వస్తుందని ఈయూ తెలిపింది. ప్రస్తుతం 23 ఈయూయేతర దేశాలు ఈ కార్యక్రమంలో అనుబంధ సభ్యులుగా ఉన్నాయి. భారత్‌ ఈ కార్యక్రమంలో చేరడాన్ని రాబోయే ఐదేళ్లకు ఇరుపక్షాలు రూపొందించుకున్న సమగ్ర వ్యూహాత్మక అజెండాలో భాగంగా భావిస్తున్నారు.