బోస్టన్, నవంబర్ 7 (ఎక్స్‌ప్రెస్ టుడే): అమెరికాలోని బోస్టన్‌లో తెలంగాణకు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని కోయ శ్రీజారెడ్డి నవంబర్ 2 రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం శబ్దుల్లాపురం గ్రామానికి చెందిన ఆమె మసాచుసెట్స్ యూనివర్సిటీ బోస్టన్‌లో (యూమాస్ బోస్టన్) మాస్టర్స్ చదువుతున్నారు.
బోస్టన్ పోలీసు విభాగం ప్రకారం, డార్చెస్టర్‌లోని ఎడిసన్ గ్రీన్ ప్రాంతంలో ఉన్న తన నివాసం నుంచి నవంబర్ 2 (సోమవారం) రాత్రి సుమారు 9.45 గంటలకు ఆమె బయటకు వెళ్లడం చివరిసారిగా కనిపించింది. నవంబర్ 3న ఆమె అదృశ్యంపై ఫిర్యాదు అందగా, పోలీసులు నవంబర్ 4న ‘మిస్సింగ్ పర్సన్ అలర్ట్’ జారీ చేసి ఆమె ఆచూకీ కోసం ప్రజల సహాయం కోరారు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉందని కుటుంబ సభ్యులు తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఆమె గురించి సమాచారం తెలిసినవారు 911కు లేదా డిస్ట్రిక్ట్ సి-11 (డార్చెస్టర్) పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు. ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఆమె తండ్రి చెప్పినట్లు వార్తా సంస్థలు తెలిపాయి.
ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ, భారత అధికారులు, బోస్టన్ పోలీసులు సమన్వయంతో ఆమెను కనిపెట్టాలని ‘ఎక్స్’లో కోరారు. ఆమె అదృశ్యానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.