జ్ఞాన సంపన్నుడు, అపార బలశాలి, భక్తాగ్రేసరుడు అయిన హనుమంతుడు కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం.

కేసరి, అంజనాదేవి దంపతులకు వాయుదేవుని అనుగ్రహంతో జన్మించిన ఆంజనేయుడు బాల్యం నుంచే అద్భుత శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాడు. సముద్ర లంఘనం, రాక్షస సంహారం వంటి ఘనకార్యాలు మామూలు వారికి సాధ్యం కాని విషయాలు.

శ్రీరాముని పట్ల, సుగ్రీవుని పట్ల ఆయన ప్రదర్శించిన విధేయత, భక్తి అనన్యసామాన్యమైనవి. ఏ కార్యాన్ని చేపట్టినా అది పూర్తయ్యేదాకా విశ్రమించని లక్షణం హనుమంతునిది. దేశంలోని దాదాపు ప్రతి పల్లెలోనూ ఆంజనేయస్వామి ఆలయాలు దర్శనమిస్తాయి.

అంజనీ పుత్రుని ఆరాధించే భక్తులకు బుద్ధి, ధైర్యం, కీర్తి, నిర్భయత్వం, ఆరోగ్యం లభిస్తాయని పెద్దల విశ్వాసం. హనుమజ్జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రసిద్ధ క్షేత్రాల్లో ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి.