గాజువాక, సెప్టెంబర్ 29: గత ఆరేళ్లుగా నిర్విరామంగా కొనసాగిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని ఈ ఏడాది కూడా అక్టోబర్ 4వ తేదీ ఆదివారం నిర్వహించాలని టీడీఎస్ ఫౌండేషన్ నిర్ణయించింది.

ఈ మేరకు ఈరోజు నిర్వహించిన ఢిల్లీ సనపల మిత్రమండలి సమావేశంలో రక్తదాన శిబిరం నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాకతీయ అర్చన జంక్షన్‌లో ఉదయం 7.00 గంటల నుంచి మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు.

గత ఆరేళ్లుగా నిర్వహించిన రక్తదాన శిబిరాల ద్వారా ఇప్పటివరకు 1,036 యూనిట్ల రక్తాన్ని సేకరించి, ఆపదలో ఉన్న అనేక మంది రోగులకు అత్యవసర సమయంలో రక్తాన్ని అందించి సహాయం చేయడం జరిగిందని తెలిపారు.

రక్తం అవసరమైన సమయంలో అందుబాటులో ఉండేలా రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, యువతను రక్తదాన కార్యక్రమాల వైపు ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నామని ఢిల్లీ సనపల తెలిపారు.

ఈ ఏడాది నిర్వహించే మెగా రక్తదాన శిబిరంలో యువత, రక్తదాతలు, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందించాలని టీడీఎస్ ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది.