విశాఖపట్నం జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో 2026 ఆగస్టు 29వ తేదీ (శనివారం) ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు గాజువాకలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు విశాఖపట్నం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీ ఎన్. గోవిందరావు తెలిపారు.
ఈ జాబ్ మేళాలో 50 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాలకు సంబంధించిన ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ మరియు ఇతర అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
అభ్యర్థులు బయోడేటా, విద్యార్హతల ధృవపత్రాల జిరాక్స్ ప్రతులు, ఆధార్ కార్డు మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. అలాగే, జాబ్ మేళాలో పాల్గొనదలచిన అభ్యర్థులు ముందస్తుగా నైపుణ్యం (Naipunyam) పోర్టల్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు.
రిజిస్ట్రేషన్ లింక్: naipunyam.ap.gov.in/user-registration
విశాఖపట్నం జిల్లా మరియు పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత ఈ అరుదైన ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఉద్యోగ లక్ష్యాలను సాధించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
