రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్‌గా, క్యాబినెట్ మంత్రి హోదాతో శ్రీమతి గద్వాల విజయలక్ష్మి సోమవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.

ప్రజాభవన్‌కు విచ్చేసిన విజయలక్ష్మికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఫైల్‌పై ఆమె సంతకం చేశారు. ఆ తర్వాత సీఎం ప్రజావాణి హాల్‌ను పరిశీలించి, అమలు జరుగుతున్న తీరును ఆమె విశ్లేషించారు.

తొలిసారి మహిళకు ఈ బాధ్యత — చారిత్రాత్మక నిర్ణయం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్‌పర్సన్ పదవికి ఇప్పటివరకు ఒక మహిళకు అవకాశం లభించలేదని, తొలిసారిగా ఒక మహిళకు ఈ బాధ్యత అప్పగించడం చారిత్రాత్మక నిర్ణయమని గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. "ఈ అవకాశం నాకు వ్యక్తిగతంగా వచ్చిన గౌరవంగా మాత్రమే చూడటం లేదు. రాష్ట్రంలోని మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు లభించిన గుర్తింపుగా, ప్రోత్సాహంగా భావిస్తున్నాను. పరిపాలనలోనూ నిర్ణయాలు తీసుకునే స్థాయిలోనూ మహిళలకు మరిన్ని అవకాశాలు రావాలనే బలమైన సందేశాన్ని ఈ నియామకం ఇస్తోంది" అని ఆమె తెలిపారు.

రాష్ట్రంలో మూడు కీలకమైన పదవుల్లో మహిళలకు, ముఖ్యంగా బీసీ మహిళలకు అవకాశం కల్పించడం మహిళా సాధికారతకు, సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని విజయలక్ష్మి అన్నారు. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. తెలంగాణ రాష్ట్ర సమగ్ర, సమతుల్య అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించేందుకు నా వంతు కృషి చేస్తాను. ఈ పదవిని గౌరవంగా కాకుండా బాధ్యతగా భావించి ప్రజలకు అంకితభావంతో సేవ చేస్తాను" అని గద్వాల విజయలక్ష్మి వివరించారు.

ఈ పదవీ బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కే. కేశవరావు, వి. హనుమంతరావు, మహ్మద్ అలీ షబ్బీర్, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, డాక్టర్ రోహిన్ రెడ్డి, మధు యాస్కి గౌడ్, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, పి. అనిల్ కుమార్ యాదవ్, పలువురు కార్పొరేషన్ చైర్మన్‌లు, ఎన్‌ఆర్‌ఐ సలహా మండలి వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, ప్లానింగ్ శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ కే. విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.