రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో మెగా డీఎస్సీ (ఉపాధ్యాయ నియామకాలు) అంశం సోమవారం తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడవగా, భర్తీ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, ఆన్లైన్లోనే జరిగిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
148 రోజుల్లోనే నియామక ప్రక్రియను పూర్తి చేసినట్టు మంత్రి తెలిపారు. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ల నుంచి హాల్‌టికెట్ల జారీ, పరీక్షా నిర్వహణ, ఫలితాల ప్రకటన వరకు ప్రతి దశనూ కచ్చితమైన షెడ్యూల్‌తో పూర్తి చేసినట్టు వివరించారు. మొత్తం 15,941 పోస్టులను భర్తీ చేసినట్టు మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియామకాలపై దృష్టి పెట్టిందని మంత్రి ఆరోపించారు. దీనికి ప్రతిగా వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ, డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ చర్చకు పట్టుబట్టారు.
చర్చ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నియామకాల్లో అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రతిపక్షం డిమాండ్ చేయగా, నాలుగు రోజుల పాటు అంశంపై సభలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్టు మంత్రి స్పష్టం చేశారు.
