భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోసం 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ-ఎయిర్‌ఫీల్డ్ వెపన్‌లు (సాట్-సా), అనుబంధ పరికరాల కొనుగోలుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)తో రూ.810.79 కోట్ల ఒప్పందంపై రక్షణ మంత్రిత్వ శాఖ సంతకాలు చేసింది. న్యూఢిల్లీలో రక్షణ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో 'బై (ఇండియన్-స్వదేశీ డిజైన్, అభివృద్ధి, తయారీ)' కేటగిరీ కింద ఈ ఒప్పందం కుదిరింది.

  • 160 సాట్-సా గ్లైడ్ బాంబులు, అనుబంధ పరికరాల కోసం బీడీఎల్‌తో రూ.810.79 కోట్ల ఒప్పందం
  • జాగ్వార్, హాక్, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాల నుంచి ప్రయోగించగల ఖచ్చితత్వ గ్లైడ్ బాంబు సాట్-సా
  • డీఆర్డీవో స్వదేశీ రూపకల్పన, 60% స్వదేశీ సాంకేతికతతో తయారీ
  • 2027-28, 2028-29 ఆర్థిక సంవత్సరాల్లో డెలివరీలు పూర్తి చేయనున్న బీడీఎల్
  • శత్రు గగనతల స్థావరాల రన్‌వేలు, బంకర్లు, హ్యాంగర్లు, రాడార్ కేంద్రాలను దూరం నుంచే ధ్వంసం చేసే సామర్థ్యం

సాట్-సా అనేది గగనతలం నుంచి భూతలంపైకి ప్రయోగించే ఖచ్చితత్వ మార్గదర్శక గ్లైడ్ బాంబు. శత్రు స్థావరాలను సురక్షిత దూరం నుంచే నిర్వీర్యం చేయగల ఈ వ్యవస్థను డీఆర్డీవో స్వదేశీయంగా రూపొందించింది. 60% స్వదేశీ సాంకేతికతతో పాటు, ఇనీషియల్ మెజర్‌మెంట్ యూనిట్, లాంగ్ ఇంపాక్ట్ డిలే ఫ్యూజ్, ట్విన్ స్టోర్ క్యారియర్ వంటి ఉప వ్యవస్థల స్వదేశీకరణ ద్వారా రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను మరింత పెంచనున్నట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

రన్‌వేలు, టాక్సీ ట్రాక్‌లు, పటిష్ట బంకర్లు, విమాన హ్యాంగర్లు, రాడార్ కేంద్రాలు, ఇంధన నిల్వలు, కమ్యూనికేషన్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకునేలా ఈ గ్లైడ్ బాంబులను రూపొందించారు. సొంత ప్రొపల్షన్ వ్యవస్థ అవసరం లేకుండా, ప్రయోగించిన విమానం వేగాన్నే వినియోగించుకుని గ్లైడ్ చేయడం వల్ల ఇతర వ్యూహాత్మక క్షిపణులతో పోలిస్తే ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నదని అధికారులు తెలిపారు. ఉపగ్రహ నావిగేషన్ సాయంతో అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదు.

160 సాట్-సా వ్యవస్థల డెలివరీని 2027-28, 2028-29 ఆర్థిక సంవత్సరాల మధ్య పూర్తి చేయనున్నట్టు బీడీఎల్ వెల్లడించింది. వీటి ప్రవేశంతో వైమానిక దళ కార్యాచరణ సామర్థ్యం మరింత మెరుగై, నిరంతర కార్యకలాపాలను కొనసాగించేందుకు, దేశ రక్షణ సన్నద్ధతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.