పోలవరం సివిల్ పనులు 90 శాతం, భూసేకరణ 94 శాతం పూర్తయిందని, మొత్తంగా ప్రాజెక్టు 77 శాతం పూర్తయినట్టు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్టు మంత్రి వెల్లడించారు. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు వేగంగా జరుగుతున్నాయని, స్పిల్‌వే పనులు కూడా గణనీయంగా పూర్తయ్యాయని వివరించారు.

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు మిగిలిన పరిహారం కింద రూ.600 కోట్లను ఈ నెలాఖరులోగా విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రాజెక్టుకు సంబంధించిన హెడ్ రెగ్యులేటర్లు, టన్నెళ్ల పనులు కూడా చివరి దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులకు నెలవారీ ప్రగతి నివేదికలు తీసుకుంటున్నామని, వీటిని వేగవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు మంత్రి వివరించారు.