మూడు దశాబ్దాలుగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారమైంది. మార్కాపురం, దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు.
నల్లమల కొండల్లోని జంట సొరంగాల నుంచి వెలువడిన కృష్నా జలాలకు సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి, జల హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్టు తొలిదశ ప్రారంభోత్సవానికి సూచికగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, కరవు నేలను తాకిన కృష్ణా జలాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. శ్రీశైలం జలాశయంలోని కొల్లం వాగు నుంచి గ్రావిటీ ద్వారా తరలించిన కృష్ణా జలాలు వెలిగొండ జంట సొరంగాల మీదుగా గంటవానిపల్లె ఆక్విడెక్టుకు చేరుకుని నల్లమల సాగర్ వైపు పరుగులు తీశాయి. నల్లమల కొండలను చీల్చుకుని కాలువల్లో ప్రవహించిన కృష్ణమ్మకు స్థానిక మహిళలు, ప్రజలు పుష్పాలతో ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం పవిత్ర జలాలను సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులపై స్వయంగా చల్లారు.
30 ఏళ్ల క్రితం భూమిపూజ.. నేడు ప్రారంభం: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం తన జీవితంలో భావోద్వేగ సందర్భమని చంద్రబాబు పేర్కొన్నారు. 1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా తానే ఈ ప్రాజెక్టుకు భూమిపూజ చేశానని, సరిగ్గా 30 ఏళ్ల తర్వాత ఆగస్టు 31న ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభిస్తున్నానని చెప్పారు. "ఆ రోజు చేసిన సంకల్పం ఈ రోజు నల్లమల సాగర్‌లో జలసిరిగా మారింది. ఇది భగీరథ ప్రయత్నం. కొండలు అడ్డు వచ్చినా తొలిచి ముందుకు వెళ్లాం. కరువు నేలకు కృష్ణమ్మను తీసుకొచ్చాం" అని సీఎం అన్నారు. వెలిగొండ బంగారు కొండ అవుతుందని, ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని, మార్కాపురం గడ్డకు, కరువుతో పోరాడిన రైతన్నలకు, ఫ్లోరైడ్ బాధలు భరించిన కుటుంబాలకు కృష్ణా జలాలతో కొత్త ఊపిరి ఇస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
నిర్వాసితుల త్యాగాలకు పాదాభివందనం: ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు, గ్రామాలను త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని సీఎం అన్నారు. కేవలం 48 రోజుల్లో 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్వాసితుల అవసరాలను గుర్తించి అదనంగా మరో రూ.169 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. కటాఫ్ తేదీని పెంచి 18 ఏళ్లు నిండిన యువతకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున అందించామని చెప్పారు.
రూ.10,200 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ.7,983 కోట్లు ఖర్చు చేసి మొదటి దశను పూర్తి చేశారు. 18.8 కిలోమీటర్ల మేర జంట సొరంగాలు, 21.8 కిలోమీటర్ల ఫీడర్ కాలువల పనులు పూర్తి అయ్యాయి. తొలిదశలో భాగంగా నల్లమల సాగర్‌కు 10.70 టీఎంసీల నీటిని తరలించనుండగా, 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందనుంది. వెలిగొండ పూర్తయితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని సీఎం వివరించారు. కృష్ణమ్మ రాకతో పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ కష్టాలకు ముగింపు పలుకుతామని పేర్కొన్నారు.
2019లో గ్రహణం.. 2024లో విముక్తి: 2019లో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు విలువైన నిర్మాణ కాలాన్ని వృథా చేసిందని, ఎన్నికలకు నెలరోజుల ముందు ప్రాజెక్టును పూర్తి చేశామని ప్రకటించడం ప్రజలను మోసం చేయడమేనని చంద్రబాబు మండిపడ్డారు. టీబీఎం యంత్రం సొరంగాల్లో ఇరుక్కుపోవడంతో అప్పట్లో పనులు పూర్తికాలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే సమస్యలను పరిష్కరించి పనులు పూర్తి చేసి కృష్ణా జలాలను అందించిందని తెలిపారు.
మార్కాపురంలోనూ 2028 కృష్ణా పుష్కరాలు: ప్రాజెక్టు మొత్తం పూర్తికావడానికి మరో రూ.1,900 కోట్ల పనులు చేయాల్సి ఉందని, వెలిగొండ ఫేజ్-2ను 2028 నాటికి పూర్తి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు ప్రకటించారు. 2028లో జరిగే కృష్ణా పుష్కరాలను మార్కాపురంలోనూ వైభవంగా నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, గోదావరి-కావేరి, మహానది-గంగా నదుల అనుసంధానం జరిగితే దేశం సుభిక్షంగా మారుతుందని ఆకాంక్షించారు. వచ్చే మూడేళ్లలో 36 ప్రాజెక్టులను పూర్తి చేసేలా ఇరిగేషన్ క్యాలెండర్ రూపొందించామని వెల్లడించారు.
తెలుగు సంప్రదాయ పంచెకట్టుతో వెలిగొండ సొరంగాల ద్వారా వచ్చిన కృష్ణా జలాలకు జల హారతి ఇచ్చిన సీఎం, ఫీడర్ కాలువ వద్ద కృష్ణమ్మ ప్రవాహానికి సాష్టాంగ నమస్కారం చేశారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలకగా, దివంగత పూలసుబ్బయ్య కుటుంబ సభ్యులను సీఎం సన్మానించారు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు కృషి చేసిన అధికారులు, జల వనరుల శాఖ మంత్రి రామానాయుడును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పి. నారాయణ, కందుల దుర్గేష్, కొలుసు పార్ధసారధి, అనగాని సత్యప్రసాద్, గుమ్మిడి సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సహా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
